ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ కవేటికి అరుదైన గుర్తింపు
Dr Srinivas Kaveti: గ్లోబల్ లీగల్ రంగంలో విశేష సేవలందిస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది, గ్లోబల్ లీగల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ కవేటికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన సత్కారం లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘మార్క్విస్ హూ ఈజ్ హూ’ (Marquis Who’s Who) బయోగ్రాఫికల్ వాల్యూమ్‌లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. సమాజంపై చూపే ప్రభావం, వృత్తిపరమైన అసాధారణ ప్రతిభ, నాయకత్వ లక్షణాలు , ఆయా రంగాలలో సాధించిన విశిష్ట విజయాలను ప్రామాణికంగా తీసుకుని ఈ అంతర్జాతీయ గౌరవానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మూడు దశాబ్దాల ప్రస్థానం..
హైదరాబాద్ నగరంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన డాక్టర్ శ్రీనివాస్ కవేతి ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. తొలినాళ్లలో కరీంనగర్లో ఫ్యామిలీ లా ప్రాక్టీస్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన, అక్కడ జస్టిస్ కొమ్మరయ్య లా కాలేజీలో లెక్చరర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని దువా అసోసియేట్స్, సింఘానియా అండ్ అసోసియేట్స్ వంటి టాప్ లా ఫర్మ్స్‌లో పనిచేస్తూ సుప్రీంకోర్టులోనూ లీగల్ ప్రాక్టీస్ చేశారు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వేల్స్ దేశాలలో సొలిసిటర్గా అర్హత సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
కవేటి లా ఫర్మ్ స్థాపించి..
ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ‘కవేటి లా ఫర్మ్’ (Kaveti Law Firm) స్థాపించి, దానికి మేనేజింగ్ అటార్నీగా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా అమెరికా, బ్రిటన్, భారత్, కెనడా, యూఏఈ దేశాల్లో ఇమ్మిగ్రేషన్, కార్పొరేట్ లా, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ వంటి పలు రంగాల్లో సేవలు అందిస్తున్నారు. దీనితో పాటు 2003 నుండి న్యూయార్క్‌లోని ‘రామ్సేయర్ & అసోసియేట్స్’ సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూ గ్లోబల్ లీగల్ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తున్నారు.
విద్యా రంగంలో విశేష కృషి..
విద్యారంగంపై ఉన్న ఆసక్తితో డాక్టర్ శ్రీనివాస్ అనేక జాతీయ, అంతర్జాతీయ లా స్కూల్స్‌లో గెస్ట్ లెక్చరర్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లోని వాక్సన్ యూనివర్సిటీ ఆఫ్ లాలో అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ, ఐసీఎఫ్ఐఏ (ICFIA) యూనివర్సిటీ, ఏషియన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకడమిక్ సెనెట్లకు సలహాదారుడిగా (Advisor) సేవలందిస్తున్నారు. భారతదేశంలో ప్రచురితమయ్యే ‘న్యాయ పత్రిక’ ప్రింట్ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆన్లైన్ పత్రికకు గౌరవ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
అసాధారణ విద్యాభ్యాసం..
చట్టం, బిజినెస్ మేనేజ్మెంట్, జర్నలిజం, సైకాలజీ, ఫిలాసఫీ, ఇంగ్లీష్ లిటరేచర్ వంటి విభిన్న రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన ఆయన.. బ్రూక్లిన్ లా స్కూల్ నుండి జేడీ (JD) ఈక్వలెంట్ పూర్తి చేశారు. 2024లో మొనాడ్ యూనివర్సిటీ నుండి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లిటిగేషన్’ అనే నూతన అంశంపై లా లో పీహెచ్డీ (Ph.D.) సాధించారు. లీగల్ రంగంలో ఆయన చేసిన కృషికి గానూ పెబుల్ హిల్స్ యూనివర్సిటీ, సాక్రటీస్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ, నిల్మ్ (NIILM) యూనివర్సిటీలతో పాటు భారత్ వర్చువల్ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
కార్పొరేట్ సంస్థలకు సీఈఓగా..
వ్యాపారవేత్తగా ‘ఆస్టెరిక్స్ కన్సల్టింగ్’ ద్వారా 700 మందికి పైగా నిపుణులను అమెరికాకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఇక్షెల్ సొల్యూషన్స్, ఇనిగియో సొల్యూషన్స్, క్లిన్ఫాక్స్ ఇంటర్నేషనల్ వంటి పలు కార్పొరేట్ సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. పూర్వపు రోజుల్లో కరీంనగర్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజకీయ, యువజన నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీగానూ పనిచేశారు.
గ్లోబల్ లీగల్ అడ్వైజర్ ..
ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన ‘ఇష్కామా గ్లోబల్ చేంజ్’ సంస్థకు లీగల్ అఫైర్స్ గ్లోబల్ ఛైర్మన్‌గా, ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన న్యూయార్క్ లాభాపేక్ష లేని సంస్థ ‘సెయింట్ ఫ్రాన్సిస్ మిషన్’కు గ్లోబల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చూస్తున్నారు. మదర్ థెరిసా ఫౌండేషన్ అడ్వైజర్‌గా, హైదరాబాద్‌లోని సాయి టెంపుల్ సొసైటీ ఛైర్మన్‌గా ఉంటూ సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్లోబల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగంలో ఆయన చేసిన సేవలకు గానూ ప్రతిష్టాత్మక ‘నెల్సన్ మండేలా అవార్డు’, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ లీడర్షిప్ అవార్డులను అందుకున్నారు.
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ), ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) వేదికలపై గ్లోబల్ హ్యూమన్ రైట్స్ , డిప్లొమాటిక్ సంబంధాల విస్తరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ కవేతి ఆకాంక్షించారు.








