కంబోడియాలోనూ యూపీఐ సేవలు.. 45 లక్షల దుకాణాల్లో అందుబాటులోకి!
విదేశీ ప్రయాణాలకెళ్లే పర్యాటకులను అత్యంతగా వేధించే సమస్య కరెన్సీ మార్పిడి. ఎంత డబ్బు మార్చుకోవాలి, ఎక్కడ మార్చుకుంటే తక్కువ కమిషన్ పడుతుంది, విదేశాల్లో స్థానిక కరెన్సీ చెల్లకుంటే పరిస్థితి ఏంటి అనే టెన్షన్లు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ముఖ్యంగా అంగ్ కోర్ వాట్ లాంటి ప్రసిద్ధ చారిత్రక కట్టడాలను చూసేందుకు కంబోడియా వెళ్లే భారతీయ పర్యాటకులకు ఈ ఇబ్బందులు మెండుగా ఉండేవి. అయితే ఈ కరెన్సీ కష్టాలకు భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ‘యూపీఐ’ (UPI) శాశ్వతంగా చరమగీతం పాడింది. సరిహద్దులు దాటి గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్న మన దేశీయ సాంకేతికత, ఇప్పుడు కంబోడియాలోనూ తన సేవలను ప్రారంభించింది.
45 లక్షల దుకాణాల్లో అందుబాటులోకి!
భారత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ విభాగానికి చెందిన ‘ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్’ (NIPL), కంబోడియాకు చెందిన ప్రముఖ ‘ఏసీఎల్ఈడీఏ బ్యాంక్’ (ACLEDA Bank)తో చేతులు కలిపింది. ఇరు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ క్యూఆర్ పేమెంట్స్ (Cross-Border QR Payments) అనుసంధాన ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో ఈ సేవలు (UPI) అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల కంబోడియా దేశవ్యాప్తంగా ఉన్న 45 లక్షలకు పైగా మర్చంట్ ఔట్లెట్లలో భారతీయ ప్రయాణికులు నేరుగా తమ మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకునే వీలు కలిగింది.
యాప్స్ అవే.. స్కానింగ్ ఇక్కడే..
ఈ కొత్త విధానం ప్రకారం.. కంబోడియా వెళ్లే భారతీయులు తమ ఫోన్లలోని గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm) లేదా భీమ్ (BHIM) వంటి రెగ్యులర్ యూపీఐ (UPI) యాప్స్‌ను యథాతథంగా వాడుకోవచ్చు. అక్కడ ఏ దుకాణానికి వెళ్లినా, ఆ దేశ జాతీయ క్యూఆర్ వ్యవస్థ అయిన ‘కేహెచ్క్యూఆర్’ (KHQR) కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. రియల్ టైమ్‌లో భారత కరెన్సీ విలువ ఆధారంగా అక్కడి కరెన్సీలోకి సులభంగా చెల్లింపులు పూర్తవుతాయి. పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు కొనడం దగ్గర్నుంచి, స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, చిన్నచిన్న రిటైల్ స్టోర్ల వరకు ఎక్కడైనా ఈ స్కానింగ్ పనిచేస్తుంది. దీనివల్ల చేతిలో క్యాష్ ఉంచుకోవాల్సిన అవసరం గానీ, కరెన్సీ ఎక్స్ఛేంజ్ కౌంటర్ల చుట్టూ తిరగాల్సిన తిప్పలు గానీ ఉండవు.
రెండో దశతో కంబోడియన్లకూ ఛాన్స్!
అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక వైపు ప్రయోజనానికే పరిమితం కాలేదు. ప్రస్తుతం ప్రారంభమైంది కేవలం మొదటి దశ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. దీని తర్వాత రాబోయే రెండో దశలో.. కంబోడియా పౌరులు కూడా మన దేశానికి వచ్చినప్పుడు తమ సొంత దేశీయ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా భారతదేశంలోని యూపీఐ (UPI) మర్చంట్ ఔట్లెట్లలో క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి సులభంగా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆర్థిక అనుసంధానం ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని, వ్యాపార సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లో భారత డిజిటల్ పవర్ ఏంటో ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది.








