భారత్‌ను దాటేసిన మరో దేశం.. చేజారిన ‘ఆరో’ స్థానం, ఇన్వెస్టర్లలో ఆందోళన!
భారత స్టాక్ మార్కెట్లకు (Stock Market) అంతర్జాతీయ వేదికపై వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న తైవాన్ దేశం మన మార్కెట్లను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ గాయం మానకముందే, తాజాగా మరో ఆసియా దేశం దక్షిణ కొరియా (South Korea) సైతం భారత మార్కెట్‌కు గట్టి షాక్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్లో మన దేశాన్ని మరింత కిందకు నెట్టేస్తూ ప్రపంచ ఆరో అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఐదు ట్రిలియన్ డాలర్లతో..
బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన తాజా గ్లోబల్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో (Stock Market) లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఊహించని విధంగా 86 శాతం పెరిగి ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్ మొత్తం విలువ కేవలం 4.8 ట్రిలియన్ డాలర్ల వద్దే నిలిచిపోయింది. దీంతో కొరియా మనల్ని దాటుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, భారత్ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ భారీ మార్పునకు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవమే. ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణానికి అత్యంత కీలకమైన చిప్ తయారీ కంపెనీలు దక్షిణ కొరియాలో భారీగా ఉండటంతో, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అటువైపు మళ్లిస్తున్నారు. తైవాన్, కొరియా లాంటి ఆసియా సాంకేతిక కేంద్రాలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారాయి.
మన మార్కెట్లో ప్రతికూలతలు..
కొన్ని నెలల క్రితం వరకు ప్రపంచ దేశాలను ఊరించిన భారత్ మార్కెట్లు (Stock Market) ఇప్పుడు ఎందుకు వెనుకబడ్డాయి అనేదానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది దేశీయ మార్కెట్లను పలు అంతర్గత, అంతర్జాతీయ అంశాలు తీవ్రంగా కలవరపెట్టాయి:
పెట్టుబడుల ఉపసంహరణ: గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారత మార్కెట్ల నుంచి సుమారు 26 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.2 లక్షల కోట్లు) విలువైన షేర్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
కరెన్సీ ఒత్తిడి, ఇంధన మంట: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వల్ల దేశంలో ద్రవ్యోల్బణ (Inflation) ఒత్తిళ్లు పెరగడం మార్కెట్ (Stock Market) సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఏఐ కంపెనీల కొరత: తైవాన్, కొరియాల తరహాలో ఏఐ సప్లయ్ చైన్ (AI Supply Chain) ద్వారా నేరుగా, తక్షణమే లబ్ధి పొందే పెద్ద టెక్నాలజీ కంపెనీలు మన దేశీయ మార్కెట్లో లేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.
ఈ వరుస ఎదురుదెబ్బల కారణంగా భారత ప్రధాన స్టాక్ (Stock Market) సూచీలు ఈ ఏడాది ఏకంగా 11 శాతం వరకు నష్టపోయాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి టెక్నాలజీ, ఏఐ ఆధారిత మార్కెట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో.. దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకుని పాత వైభవాన్ని అందుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








