శింబు సినిమాలో ధనుష్?
కోలీవుడ్‌లో ఎన్నాళ్లుగానో చర్చనీయాంశంగా మారిన ధనుష్(Dhanush)- శింబు(Simbu) సమీకరణం మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం తరచూ వినిపించినప్పటికీ, దానిపై ఎప్పుడూ అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా వీరిద్దరూ ఒకే తెరపై కనిపించే అవకాశముందనే వార్త తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అభిమానులు ఊహించని కాంబినేషన్ కావడంతో ఈ టాక్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaran) రూపొందిస్తున్న అరసన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శింబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా వెట్రిమారన్ సృష్టించిన వడా చెన్నై(Vada Chennai) ప్రపంచంతో అనుసంధానమై ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో వడ చెన్నైలో కీలక పాత్ర పోషించిన ధనుష్‌ను ఓ ప్రత్యేక గెస్ట్ రోల్ కోసం సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కొన్ని నిమిషాల నిడివి ఉన్నప్పటికీ కథలో కీలక మలుపుకు కారణమయ్యే పాత్రగా దీనిని డిజైన్ చేశారనే టాక్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వెట్రిమారన్- ధనుష్ కాంబినేషన్‌కు కోలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పొల్లాధవన్(Polladhavan), ఆడుకలం (Aadukalam), అసురన్(Asuran), వడా చెన్నై(Vada chennai) వంటి సక్సెస్ఫుల్ సినిమాలు ఈ జోడీకి భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. అలాంటి డైరెక్టర్ కోరితే ధనుష్ ప్రత్యేక పాత్రకు అంగీకరించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ధనుష్ మరియు శింబు ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారనుంది. అప్పటివరకు ఈ ప్రచారంపై మేకర్స్ స్పందన కోసం కోలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.








