గౌరీతో ఆమిర్ బంధం పెళ్లి వరకు వెళ్లిందా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్(Aamir khan) మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా గౌరీ స్ప్రాట్(gauri sprat)తో రిలేషన్షిప్లో ఉన్న ఆమిర్, ఇటీవల తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులకు అధికారికంగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించడంతో వారి బంధంపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
తాజా సమాచారం ప్రకారం ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ జూలై 5న వివాహ బంధంతో ఒక్కటయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహం అత్యంత సాదాసీదాగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగనుందని సమాచారం. ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం ప్రధానంగా చట్టపరమైన వివాహ ప్రక్రియను పూర్తి చేయడానికేనని, గత ఏడాది కాలంగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
వ్యక్తిగత జీవితంలో ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కానుంది. మొదట రీనా దత్తా(reena dutta)ను వివాహం చేసుకున్న ఆమిర్‌కు జునైద్(junaid), ఐరా(ira) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత డైరక్టర్ కిరణ్ రావు(kiran rao)ను పెళ్లి చేసుకున్న ఆయనకు ఆజాద్(Aajad) అనే కుమారుడు ఉన్నాడు. 2021లో కిరణ్ రావుతో విడిపోయిన తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న ఆమిర్, ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.








