ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయండి
నెల్లూరులో సెమీకండక్టర్ పరికరాల తయారీ యూనిట్ స్థాపించండి
శ్రీసిటీలో రోబోటిక్స్ & ఆటోమేషన్ సేవలను విస్తరించండి
మాస్కో: రష్యాకు చెందిన ప్రీమియర్ సెమీకండక్టర్స్ తయారీ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ (Element Group) ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ (Mr. Khazov Oleg), డైరక్టర్ (ఎక్సటర్నల్ రిలేషన్స్) కాన్ స్టాంటిన్ గోర్కోవ్ (Mr. Konstantin Gorshkov), ఇంటర్నేషనల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ హెడ్ జఖరోవ్ ఆంటోన్ (Mr. Zakharov Anton), చీఫ్ ఎక్సటర్నల్ రిలేషన్స్ స్పెషలిస్ట్ శ్రీమతి సిడోరుక్ ఎలిజవెటా (Ms. Sidoruk Elizaveta)లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…భారతదేశంలో విస్తరిస్తున్న డిజిటల్ రవాణా, బ్యాంకింగ్ కార్డ్ వ్యవస్థలకు అవసరమైన సురక్షితమైన RFID ట్యాగ్లు, స్మార్ట్ కార్డ్ మైక్రోచిప్‌లను స్థానికంగా తయారు చేసేందుకు ఎలిమెంట్ గ్రూప్ విశాఖపట్నం (వైజాగ్)లో ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయండి. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ పవర్‌ట్రెయిన్, సోలార్ కన్వర్టర్ మార్కెట్లకు సరఫరా చేయడానికి, ఎలిమెంట్ టెక్నాలజీని ఉపయోగించి భాగస్వామ్య సంస్థలతో కలసి నెల్లూరులో సిలికాన్ కార్బైడ్, పవర్ సెమీకండక్టర్ పరికరాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయండి.
స్థానిక ఆటోమోటివ్, అసెంబ్లింగ్ లైన్లను ఆటోమేట్ చేయడానికి, ఇప్పటికే శ్రీ సిటీ (తిరుపతి జిల్లా)లో ఉన్న తయారీ దిగ్గజాలకు సమీపంలో జాయింట్ ఇండస్ట్రియల్ మోటార్ – సర్వో మోటార్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఏర్పాటు కాబోతోంది. అక్కడ రోబోటిక్స్ సేవల కోసం ఎలిమెంట్ గ్రూప్ రోబోటిక్స్ & ఆటోమేషన్ డివిజన్ ఏర్పాటు చేయండి. కమ్యూనికేషన్, నావిగేషన్, ఏరోస్పేస్ ఆన్-బోర్డ్ టెలిమెట్రీ సిస్టమ్‌ల కోసం మాడ్యులర్ కాంపోనెంట్లపై దృష్టి సారిస్తూ, వైజాగ్ హై-టెక్ కారిడార్‌లో ఒక సహకార మైక్రోఎలక్ట్రానిక్స్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. అమరావతి స్మార్ట్ సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా స్మార్ట్ సిటీ హార్డ్‌వేర్ & ఐఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలిమెంట్ గ్రూప్ ఆధ్వర్యాన లోకలైజ్డ్ మైక్రోకంట్రోలర్లు, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్‌వేర్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.

ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ స్పందిస్తూ… ఎలిమెంట్ గ్రూప్ కార్పొరేట్ విస్తరణలో భాగంగా భారత్ లో రష్యన్ మైక్రోఎలక్ట్రానిక్స్ డిజైన్ హౌస్‌లు, భారతీయ టెక్ సంస్థల సాంకేతిక భాగస్వామ్యంతో సెమీకండక్టర్ పంపిణీ నెట్‌వర్క్‌లను నడిపిస్తున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ పోర్ట్‌ఫోలియో, సురక్షితమైన RFID మైక్రోచిప్‌లు, స్మార్ట్ కార్డ్ మాడ్యూల్స్, ట్రాన్స్పోర్ట్ కార్డ్ టెక్నాలజీలను దక్షిణాసియా ఆర్థిక రంగానికి ఎగుమతి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక టెక్ వ్యూహంలో భాగంగా తమ గ్రూప్ అధునాతన పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోకంట్రోలర్లు IoT హార్డ్వేర్లను పంపిణీ చేయడానికి భారతీయ హార్డ్‌వేర్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. కీలకమైన వాణిజ్య విభాగాలు, దేశీయ టెలికాం, పారిశ్రామిక ఆటోమేషన్ తయారీదారుల కోసం కాంపోనెంట్ సోర్సింగ్, కాంపోనెంట్ లైసెన్సింగ్, సప్లయ్ చైన్ లాజిస్టిక్స్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఎలిమెంట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మాస్కో ప్రధాన కేంద్రంగా 2019లో ఏర్పాటైన ప్రీమియర్ సెమీ కండక్టర్స్ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ 30కి పైగా డిజైనింగ్, మానుఫ్యాక్చరింగ్ సెంటర్లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో 9వేలమందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎలిమెంట్ గ్రూప్ 38.5 బిలియన్ రూబుల్స్ (రూ.5,090 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది.)








