పవన్ కళ్యాణ్ పై రాజకీయ కక్షతో సినీ పరిశ్రమను అవమానించొద్దు- పాశం యాదగిరికి నిర్మాత రాంకీ స్ట్రాంగ్ కౌంటర్
రాజకీయాల్లో విమర్శలు చేయడం వేరు.. ఆ నెపంతో ఒక పరిశ్రమ మొత్తాన్ని, దాన్ని నమ్ముకున్న వేలాది కుటుంబాలను అవమానించడం వేరు. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత కక్షో, రాజకీయ కంచో పెట్టుకుని.. దానికి సినీ ఇండస్ట్రీని ముడిపెడుతూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరం, దారుణం అని కౌంటర్ ఇస్తున్నారు సినీ నిర్మాత రాంకీ. మేధావి ముసుగులో ఇండస్ట్రీపై ఆయన వెళ్లగక్కిన విషానికి, సినీ నిర్మాత రాంకీ తనదైన శైలిలో చురకలు అంటించారు.
పాశం యాదగిరి బ్యాక్‌గ్రౌండ్ చూసి, ఆయన జర్నలిజం అనుభవం చూసి ఇన్నాళ్లూ మేధావి అనుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ కలం, ఆ గళం చూసి ఒక గౌరవం ఉండేది. పాశం కళ్ల ముందే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, వందల మంది రాజకీయ నేతలను ఆయన చూశారు. కానీ, ఇంత చదువు చదివి, ఇన్నేళ్ల సీనియారిటీ పెట్టుకుని.. ఈ రోజు ఒక పవన్ కల్యాణ్ లాంటి ఒక రాజకీయ నాయకుడిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, మధ్యలోకి సినీ ఇండస్ట్రీని లాగి తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారు పాశం. ఒకవిధంగా ఆయన మాట్లాడే చౌకబారు మాటలు ఆయన స్థాయికి తగవు.
పవన్ కల్యాణ్‌పై అంత రాజకీయ కక్ష ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. అంతేగానీ, ఆయనను తిట్టే నెపంతో అసలు ఏ సంబంధం లేని చిత్ర పరిశ్రమపై తన అజ్ఞానాన్ని, విషాన్ని ఎందుకు వెళ్లగక్కుతున్నట్టు? రాజకీయ లబ్ధి కోసం, తన పాతకాలపు మైండ్ సెట్‌తో ఇండస్ట్రీలో ప్రాంతీయ విభేదాలు సృష్టించాలనుకోవడం.. పాశం యాదగిరిలోని అహంకారాన్ని బయటపెడుతోంది. ఇక్కడ పాశం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ, ఆంధ్రా అనే బేధాల్లేవు. మనమంతా ‘తెలుగువాళ్లం’ అనే ఒకే ఒక్క సూత్రంతో, ఒకే కుటుంబంగా ఇక్కడ కలిసి బతుకుతున్నాం.
సంక్రాంతికో, పండగకో సొంత ఊర్లకు వెళ్లి రావడం మినహా.. మిగతా జీవితం అంతా హైదరాబాద్‌లోనే. ఇక్కడే ఇళ్లు, ఇక్కడే పిల్లల చదువులు, ఇక్కడే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. సో, ఇండస్ట్రీని విడదీయాలకుంటున్న పాశం యాదగిరి పప్పులు ఇక్కడ ఉడకవు.
అయినా.. సినిమా ఇండస్ట్రీ వల్ల తెలంగాణకు ఏమీ జరగడం లేదన్నట్టు మాట్లాడుతున్నారు పాశం యాదగిరి. అసలు ఆయనకు అర్థశాస్త్రం తెలుసా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వందల, వేల కోట్ల రూపాయల చలామణి జరుగుతోంది ఈ హైదరాబాద్ గడ్డ మీదనే. ఇక్కడే సంపాదిస్తున్నారు, ఇక్కడే తింటున్నారు, పైసా పైసాకు ఇక్కడే ప్రభుత్వానికి టాక్సులు కడుతున్నారు. పాశం యాదగిరి వేలెత్తి చూపిస్తున్న వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తాము సంపాదించిన మొత్తానికి తెలంగాణలోనే సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారు. అంతటితో ఆగకుండా, ఆ డబ్బును తిరిగి తెలంగాణలోనే విభిన్న వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెడుతూ తెలంగాణ ప్రగతికి తోడ్పడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విడిపోతుందని తెలియకముందే చాలామంది ఇక్కడ వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా భయపడి ఏ ఒక్కరూ తమ రూపాయిని వెనక్కి తీసుకోలేదు. అదే నమ్మకంతో తెలంగాణలో వ్యాపారాలను కొనసాగిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాదా యాదగిరి అని ప్రశ్నిస్తున్నారు సినీ నిర్మాత రాంకీ.
మైక్ దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరూ చేతగాని వాళ్లు లేరు. పాశం యాదగిరి సీనియారిటీని, ఆయన ఉద్యమ బ్యాక్‌గ్రౌండ్‌ను గౌరవించడం అంటే అర్థం.. ఆయన ఏం మాట్లాడినా పడతారని కాదు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తూ, రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న సినీ రంగాన్ని కించపరిచే హక్కు అసలు యాదగిరికి ఎవరిచ్చాడు? రాజకీయం చేసుకో.. కానీ ఇండస్ట్రీ జోలికొస్తే మాత్రం సహించేది లేదు. ఇప్పటికైనా పాశం యాదగిరి తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.








