ఈఎంఐ కట్టేవారికి ఆర్బీఐ గట్టి షాక్ ఇవ్వబోతోందా?
ఇల్లు, కారు కొనుగోలు చేసి ప్రతి నెలా బ్యాంక్ ఈఎంఐలు (EMI) కడుతున్న మధ్యతరగతి ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి తాత్కాలికంగా ఒక మంచి వార్త వినపడబోతోంది. ఈ నెలలో జరగనున్న ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు బలంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవకపోవచ్చని, రాబోయే రోజుల్లో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న ఇంధన ధరల మంట కారణంగా ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధమవుతోందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి వడ్డీ రేట్లు సేఫ్
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) నిర్వహించిన తాజా సర్వేలో పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు ఆర్బీఐ (RBI) రాబోయే అడుగులపై ఆరింతల ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) కేంద్ర బ్యాంకు నిర్దేశించుకున్న 4 శాతం పరిమితిలోనే కొనసాగుతోంది. దీనివల్ల ఆర్బీఐ ఇప్పుడప్పుడే వడ్డీ రేట్లను పెంచి మార్కెట్‌ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. వాస్తవానికి గడిచిన ఏడాది కాలంగా దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్బీఐ.. అందుకోసం కీలకమైన రెపో రేటును ఏకంగా 1.25 శాతం మేర తగ్గించింది. దీనివల్ల లోన్ తీసుకున్న వారికి చాలా కాలంగా ఈఎంఐల భారం తగ్గుతూ వస్తోంది. ఇదే ఊపును ఈ జూన్ సమీక్షలోనూ కొనసాగించి, రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ‘వేచి చూసే ధోరణి’ని అవలంబించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలతోనే ముప్పు!
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఆర్బీఐని (RBI) అంత సులభంగా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేవు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, మార్కెట్లో మిగతా అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అయితే ధరలు పెరిగిన వెంటనే ఆర్బీఐ కంగారుపడి నిర్ణయాలు తీసుకోకపోవచ్చని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) ఆర్థికవేత్త గౌరా సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ఈ పెరిగిన ఇంధన ధరల ప్రభావం ఇతర రంగాలపై ఎలా పడుతుందో లోతుగా గమనించిన తర్వాతే, పరిస్థితికి తగినట్లుగా ఆర్బీఐ (RBI) ముందడుగు వేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు?
జూన్ సమీక్షలో వడ్డీ రేట్లను మార్చకపోయినప్పటికీ.. ఈ యథాతథ స్థితి కేవలం తాత్కాలికమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యోల్బణం మళ్లీ నియంత్రణ దాటి 5 శాతం మార్కును దాటే ప్రమాదం ఉందని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం గనుక 5 శాతం దాటితే, మార్కెట్‌ను అదుపు చేయడానికి ఆర్బీఐకి (RBI) వడ్డీ రేట్లు పెంచడం మినహా మరో మార్గం ఉండదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY27) ఆర్బీఐ కనీసం రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే వారిపై ఈఎంఐల భారం మళ్లీ భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.








