ఐదుకోట్ల మంది ఆంధ్రులకు మాత్రం రాజధాని వద్దా? : మంత్రి సవిత
అమరావతిపై జగన్ (Jagan) విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత (Savita) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.వైసీపీ ప్రభుత్వంలో రుషికొండ (Rushikonda) మీద రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టిన జగన్, అమరావతి (Amaravati) నిర్మాణం మీద విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడని, చేయనివ్వడని విమర్శించారు. రాజధానిపై రోజుకో మాట, పూటకో ప్రకటనే వైసీపీ సిద్ధాంతమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నామన్న జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలుపెట్టారని అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మావిగన్ (Mavigan) అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. నలుగురు కుటుంబ సభ్యులున్న జగన్కు 4 ప్యాలెస్ లు ఉండగా లేనిది, 5 కోట్ల జనాభాకు మంచి రాజధాని అవసరం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద కాపలాపెట్టిన జగన్కు అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC) గురించి మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు.








