సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ – బండ్ల గణేష్ రచ్చ రంబోలా!
సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయాల్లోనూ ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో.. నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన పరోక్ష సెటైర్లకు, పవన్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని, తానే స్వయంగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.
పవన్ కళ్యాణ్ పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండా.. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ఇక్కడ పేరు చెప్పకపోయినప్పటికీ, పొత్తులతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జనసేనాని గురించే ఈ వ్యాఖ్యలని నెటిజన్లకు స్పష్టంగా అర్థమైంది.
ఇవి కూడా చదవండి
ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయితే అందరికంటే ముందుగా, పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రంగంలోకి దిగారు. బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అత్యంత తీవ్ర పదజాలంతో ఆయనపై విరుచుకుపడ్డారు.
“ఒరేయ్… నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా?” అంటూ బండ్ల గణేష్ ఘాటుగా ప్రశ్నించారు.
అంతటితో ఆగకుండా.. “ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే కనిపిస్తావు. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వద్దు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్” అంటూ ఊరమాస్ పంచ్‌లతో హెచ్చరించారు.
బండ్ల గణేష్ కౌంటర్ ఇలా ఉంటే, అటు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రకాష్ రాజ్‌ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. గతంలో ఆయన పోటీ చేసిన ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయిన వ్యక్తి, ఇక్కడ వచ్చి పొత్తుల గురించి, సింగిల్ ఎంట్రీల గురించి మాట్లాడటం పెద్ద కామెడీగా ఉందంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
గతంలోనూ పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలపై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. అయితే ఈసారి తెలంగాణ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ ఈ ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య జరుగుతున్న ఈ రచ్చ తీవ్ర దుమారం రేపుతోంది.








