అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ సతీమణికి గాయాలు
Madhu Yaskhi: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ సతీమణి, సీనియర్ వైద్యురాలు డాక్టర్ సుచి యాష్కి (సుచి గౌడ్) అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
మధుయాష్కీ దంపతులు తమ చిన్న కుమార్తె గగన యాష్కిని బోస్టన్లోని హార్వర్డ్ వర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ (MD) కోర్సులో చేర్పించారు. ఆ తర్వాత లగేజీ ఎక్కువగా ఉండటంతో దంపతులిద్దరూ వేర్వేరు వాహనాల్లో న్యూయార్క్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మార్గమధ్యంలో తీవ్రమైన వర్షం పడుతుండటంతో డాక్టర్ సుచి ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి, రోడ్డుపై స్లిప్ అయి పల్టీలు కొట్టింది.
ప్రాణాపాయం లేదు..
ఈ కారు బోల్తా పడిన ప్రమాదంలో డాక్టర్ సుచి గౌడ్‌కు పక్కటెముకలు విరిగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పిందని, క్రమంగా కోలుకుంటున్నారని మధుయాష్కీ కుటుంబ సభ్యులు వెల్లడించారు.








