USA: క్లీవ్‌ల్యాండ్‌లో శంకర నేత్రాలయ తొలి నిధి సమీకరణ కార్యక్రమం దిగ్విజయం
క్లీవ్‌ల్యాండ్: అమెరికాలోని ఒహియో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్ నగరంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి నిధి సమీకరణ కార్యక్రమం ఎకోస్ ఆఫ్ కంపాషన్ అట్టహాసంగా ముగిసింది. కళలు, కరుణ కలయికే లక్ష్యంగా మెడినా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో స్థానిక కళాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కళాకారుల అద్భుత ప్రదర్శనలు ఒహియో సాంస్కృతిక కమిటీ సభ్యురాలు కల్యాణి వేటూరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత విభాగంలో సప్త స్వర అకాడమీ (గురువులు విష్ణు పసుమర్తి, కృష్ణ పసుమర్తి) మధురాలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (గురువు లలిత్ సుబ్రహ్మణియన్) విద్యార్థులు తమ గాత్రంతో అలరించారు. నృత్య విభాగంలో కూచిపూడి, భరతనాట్యం, కథక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మయూరి డాన్స్ అకాడమీ, కలామందిర్ (సుజాత శ్రీనివాసన్), అంగకళ కథక్ అకాడమీ (అంతర దత్తా), నర్తనం డాన్స్ అకాడమీ (సుధా కిరణ్మయి తోటపల్లి) విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు భారతీయ సంస్కృతికి అద్దం పట్టాయి. ప్రతికూల వాతావరణంలోనూ చెరగని సేవాభావం భారీ మంచు తుపాను, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, సుమారు 150 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరై తమ మద్దతును ప్రకటించారు. చూపు లేని వారికి వెలుగునివ్వాలనే శంకర నేత్రాలయ సంకల్పానికి అండగా నిలిచేందుకు వాతావరణం అడ్డంకి కాలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా ఫెస్ట్ యూఎస్ఏ స్థాపకులు భరత్ పటేల్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకుల కృతజ్ఞతలు కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని నిరూపించిన ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన ఎస్ఎన్యూఎస్ఏ అధ్యక్షులు బాల రెడ్డి ఇందుర్తి సహా నీలిమ గడ్డమనుగు, మూర్తి రేకపల్లి, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వంశీ ఏరువరం, శ్యామ్ అప్పల్లి, రత్నకుమార్ కవుటూరు, గిరి కోటగిరి, అమర్ అమ్యరెడ్డి, గోవర్ధన్ రావు నిడిగంటిలకు ఒహియో చాప్టర్ ధన్యవాదాలు తెలియజేసింది.






