India-USA: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రారంభం.. తొలి విడతపై దృష్టి
ఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మరోసారి వేగం పుంజుకోనున్నాయి. డిసెంబర్ 10 నుంచి మూడు రోజుల పాటు ఈ చర్చలు ఢిల్లీలో జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రౌండ్లో ఇరు దేశాలు ముఖ్యంగా తొలి విడత (ఫేజ్-1) ఒప్పందాన్ని ఖరారు చేయడంపై దృష్టి సారించనున్నాయి. ఈ కీలక సమావేశాలకు అమెరికా తరపున డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. భారతీయ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన తర్వాత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న రెండవ చర్చా సమావేశం ఇది. అంతకుముందు సెప్టెంబర్ 16న అమెరికన్ ప్రతినిధులు భారత్‌ను సందర్శించగా, ఆ తర్వాత సెప్టెంబర్ 22న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాలో పర్యటించింది.
లక్ష్యం 500 బిలియన్ డాలర్లు..
ఈ ఏడాదిలోనే అమెరికాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరేలా సుంకాల తగ్గింపు అంశాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఇరు దేశాలు 2025 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి వాణిజ్య చర్చలను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం సుమారు 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య విలువను 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్-అమెరికా సంకల్పించాయి. ఈ లక్ష్యసాధన దిశగా ఇప్పటివరకు ఆరు విడతల సమావేశాలు పూర్తయ్యాయి.
– Vishal






