ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. భారత్ సహా 54 దేశాలపై టారిఫ్ అస్త్రం
US Tariffs: అమెరికాకు దిగుమతి అయ్యే వివిధ వస్తువులపై అగ్రరాజ్యం మరోసారి అదనపు పన్నుల భారాన్ని మోపడానికి సిద్ధమైంది. కార్మికులతో బలవంతంగా చాకిరీ చేయించి ఉత్పత్తులను తయారు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. దీనిని అడ్డుకోవడంలో విఫలమైన భారత్‌తో పాటు మొత్తం 54 దేశాలపై 12.5 శాతం అదనపు టారిఫ్ (సుంకాలు) విధించాలని అమెరికా తాజాగా ప్రతిపాదించింది. భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో దిల్లీలో మూడు రోజుల తొలివిడత చర్చలు ప్రారంభమైన రెండో రోజే అమెరికా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. వెట్టిచాకిరీ, పరిమితికి మించిన పారిశ్రామిక వినియోగంపై అమెరికా వ్యక్తంచేసిన అభ్యంతరాలపై భారత్ ఇప్పటికే స్పందించింది. ఇరుదేశాల దౌత్య సంబంధాల ద్వారానే ఇలాంటి వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలని, భారత్‌పై దర్యాప్తును నిలిపివేయాలని స్పష్టం చేసింది.
54 దేశాలపై 12.5 శాతం..
వెట్టిచాకిరీతో వస్తువులను తయారుచేసి ఎగుమతి చేయడం, పారిశ్రామిక సామర్థ్యంపై ఉన్న ఆందోళనల కారణంగా భారత్ సహా 60 దేశాలపై ఈ సంవత్సరం మార్చి 11, 12 తేదీల్లోనే యూఎస్టీఆర్ (USTR) రెండు విచారణలను మొదలుపెట్టింది. వీటికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేస్తూ.. ట్రంప్ ప్రభుత్వం 54 దేశాలపై 12.5 శాతం, మరో ఆరు దేశాలపై 10 శాతం చొప్పున సుంకాలు విధించాలని కోరినట్లు యూఎస్టీఆర్ రాయబారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే క్రమంలో బ్రెజిల్ దేశంపై ఏకంగా 25 శాతం సుంకాన్ని ప్రతిపాదించారు. అమెరికా రూపొందించిన ఈ ఆంక్షల జాబితాలో భారత్‌తో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక వంటి ప్రముఖ దేశాలు ఉన్నాయి.
సంప్రదింపుల గడువు వివరాలు..
సెక్షన్ 301 ప్రొసీడింగ్స్ దర్యాప్తు విషయమై అమెరికాతో భారత్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. దీనిపై ఆయా దేశాలు తమ అభ్యర్థనలను ఈ నెల 22వ తేదీ లోపు అమెరికా వాణిజ్య ప్రతినిధికి (USTR) సమర్పించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన లిఖితపూర్వక సమాధానాలను జులై 6 వరకు సమర్పించే అవకాశం కల్పించారు. అనంతరం జులై 7వ తేదీన దీనిపై బహిరంగ విచారణ ఉంటుందని అధికారులు వెల్లడించారు.








