ఒక డ్రైవర్ చేసిన తప్పుకు.. ప్రపంచం మొత్తం శ్మశానం అయింది..
Sarajevo: చరిత్రలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి జరిగేటప్పుడు చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ప్రపంచం కాలంలో వెనక్కి తిరిగి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది… అదే క్షణం ప్రపంచాన్ని సమూలంగా మార్చేసిందని. 1914లో సరాయెవో వీధిలో జరిగినది కూడా సరిగ్గా అలాంటిదే. ఒక కారు, ఒక తప్పు మలుపు, ఒక 19 ఏళ్ల కుర్రాడు, రెండు బుల్లెట్లు… ఇంత చిన్న సంఘటన చివరికి కోట్ల మంది మరణాలకు కారణమైంది.
సరాయెవో వీధిలో విధి ఆడిన వింత నాటకం..
1914 జూన్ 28, ఉదయం పదకొండు గంటల సమయం. బోస్నియాలోని సరాయెవో వీధులు జనం , పోలీసులతో సందడిగా ఉన్నాయి. ఆస్ట్రియా-హంగేరీ రాజ్యానికి వారసుడైన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ తన భార్యతో కలిసి ఓపెన్ కారులో ప్రయాణిస్తున్నాడు. ఆయనను చంపడానికి సెర్బియన్ జాతీయవాదుల గుంపు ముందే ప్లాన్ వేసినప్పటికీ, మొదట వారి ప్రయత్నం ఫెయిల్ అయింది. ఈ హత్యాయత్నం చేసిన గవ్రిలో ప్రిన్సిప్ అనే 19 ఏళ్ల యువకుడు తీవ్ర నిరాశతో, అక్కడే ఓ మూల తినడానికి ఏదో కొనుక్కుంటూ నిలబడ్డాడు.
ఇవి కూడా చదవండి
సరిగ్గా అక్కడే ప్రపంచం చరిత్ర ఊహించని పెద్ద మలుపు తిరిగింది. అనుకోకుండా ఆర్చ్‌డ్యూక్ కార్ డ్రైవర్ రాంగ్ టర్న్ తీసుకుని తప్పు రోడ్డులోకి వెళ్లిపోయాడు. కన్ఫ్యూజ్ అయిన డ్రైవర్ కారు ఆపి, రివర్స్ వేయడం మొదలుపెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ కారు కాస్తా ఆగిపోయింది. అదీ సరిగ్గా ఆ కుర్రాడు నిలబడిన చోటే. కారు తన ఎదురుగా ఆగగానే ఆ కుర్రాడు తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడు. విధి తాను ఎవరినైతే చంపాలనుకున్నాడో, ఆ వ్యక్తినే తన ముందే తెచ్చి నిలిపింది. నమ్మలేకపోయిన ఆ యువకుడిలో భయం, ధైర్యం, ఆనందం అన్నీ ఒక్కసారిగా ప్రవేశించాయి. అప్రయత్నంగా జేబులో చెయ్యి పెట్టి తుపాకీ తీసి అరక్షణంలో రెండు తూటాలు పేల్చాడు. ఆ శబ్దం సరాయెవో వీధుల్లో మాత్రమే వినిపించినా, దాని మంట మాత్రం వందేళ్లపాటు యావత్ ప్రపంచాన్ని కాలుస్తూనే ఉంది.
గొలుసుకట్టు యుద్ధం..
ఆర్చ్‌డ్యూక్, అతని భార్య నిమిషాల్లో మరణించారు. రాచ పీనుగ ఒంటరిగా పోదు అన్నట్లుగా… ఇది జరిగాక యూరప్ మొత్తం అగ్నిగుండంగా మారింది. ఆస్ట్రియా-హంగేరీ ఈ హత్యకు సెర్బియానే బాధ్యురాలిని చేస్తూ శిక్షించాలనుకుంది. కానీ సెర్బియా ఒంటరిది కాదు. దానికి రష్యా అనే బలమైన రక్షకుడు ఉన్నాడు. రష్యా రంగంలోకి దిగడంతో జర్మనీ భయపడింది. జర్మనీ తన మిత్రదేశమైన ఆస్ట్రియా కోసం రష్యాపై, అలాగే అటు నుండి దాడి వస్తుందేమోననే భయంతో రష్యా మిత్రదేశమైన ఫ్రాన్స్‌పై కూడా యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్‌ను చేరుకోవడానికి జర్మన్ సైన్యాలు బెల్జియం గుండా నడవడంతో, బెల్జియాన్ని రక్షిస్తానని మాటిచ్చిన బ్రిటన్ కూడా యుద్ధంలోకి దిగింది. 1914లో యూరప్ దేశాలు చేతులు పట్టుకుని వరుసలో నిలబడిన మనుషుల గొలుసు లాంటివి కాబట్టి, మొదటివాడు తోయగానే అందరూ వరసగా కూలిపోయారు. కేవలం ఐదు వారాల్లో ఓ ప్రపంచ మహాయుద్ధంగా మారిన ఈ సంక్షోభంలో, నాలుగు సంవత్సరాలలో దాదాపు రెండు కోట్ల మంది మరణించారు.
ఈ యుద్ధం అక్కడితో ఆగకుండా నాలుగు మహాసామ్రాజ్యాలను నేలమట్టం చేసింది. రష్యాను విప్లవం వైపు నెట్టి ప్రపంచానికి తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అందించింది. యుద్ధానంతర కఠినమైన శాంతి ఒప్పందాలు జర్మనీని ద్వేషంతో నింపగా, ఆ చేదు భావాలనే తర్వాత హిట్లర్ తన ఆయుధంగా చేసుకున్నాడు. అది ఇరవై సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధంగా పేలింది. ఆ తర్వాత కోల్డ్ వార్, మహా సామ్రాజ్యాల పతనం, ఇప్పటి యూరప్ , మధ్యప్రాచ్యం సరిహద్దుల మార్పులన్నీ ఆనాడు ఒక డ్రైవర్ తీసుకున్న తప్పుడు మలుపు నుండి వ్యాపించిన అలలే.
2026… ఈసారి అది ప్రమాదం కాదు..
చరిత్రలో ప్రతీసారి మంటలు ప్రమాదవశాత్తూ మొదలవ్వవు, కొన్నిసార్లు వాటిని కావాలనే వెలిగిస్తారు. 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై అకస్మాత్తుగా దాడి చేశాయి. శాంతి చర్చలు కొనసాగుతున్నప్పుడే ఈ ముందస్తు రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎలాంటి తప్పు మలుపు లేదు, కానీ ఫలితం మాత్రం 1914ను గుర్తుచేస్తోంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తూ ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లింది. వేల మంది చనిపోగా, లక్షల మంది ఇళ్లు వదిలి పారిపోతున్నారు. లెబనాన్, గల్ఫ్ దేశాలు కూడా ఈ మంటల్లో చిక్కుకున్నాయి .
శతాబ్దం క్రితం చూసిన అదే గొలుసుకట్టు వలయం మళ్లీ కనిపిస్తూ, ప్రపంచాన్ని కాల్చేయడానికి ఒక్క చిన్న నిప్పురవ్వ చాలని మరోసారి నిరూపించింది. 1914లో అది ఒక తప్పు మలుపు అయితే, 2026లో ఇది ఒక రాజకీయ నిర్ణయం. కానీ పాఠం మాత్రం ఒకటే… ప్రపంచాన్ని మార్చడానికి ఎప్పుడూ పెద్ద కారణాలు అవసరం లేదు. ఒక్క సంఘటన, ఒక్క ట్రిగ్గర్, ఒక్క మనిషి నిర్ణయం చాలు. కొన్నిసార్లు చరిత్ర తుపాకీ ట్రిగ్గర్ మీద, మరికొన్నిసార్లు స్టీరింగ్ వీల్ మీద ఉంటుంది. కానీ మంటలు మొదలైన తర్వాత అవి ఎక్కడ ఆగుతాయో ఎవరూ మాత్రం చెప్పలేరు.








