బాబ్ అల్-మందెబ్ జలసంధిపై ఇరాన్ కన్ను…!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హార్మూజ్ ను గుప్పిట పట్టిన ఇరాన్.. ఆ జలసంధిపై తనదే ఆధిపత్యమని ప్రకటించుకుంది. అంతేకాదు.. అక్కడి నుంచి వచ్చే నౌకలపై టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తోంది. అమెరికా ఎంతగా బెదిరించినా , ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా.. ససేమిరా తగ్గేది లేదని తేల్చేసింది .దీంతో గల్ఫ్ దేశాలు సహా ప్రపంచమంతటా ఆయిల్ సంక్షోభం విస్తృతమైంది.
దీని నుంచి ఎలా బయటపడాలా అని ప్రపంచదేశాలు ఆలోచిస్తున్న తరుణంలో.. లేటెస్టుగా ఇరాన్ బాబ్ అల్-మందెబ్ జలసంధిపైనా కన్నేసినట్లు కనిపిస్తోంది.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిగా కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. జూన్ 1న ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో పరోక్షంగా జరుపుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు, బాబ్ అల్-మందెబ్ సహా పలు మార్గాల్లో ప్రతిఘటనను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయడంపై ఆలోచిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో పౌరులు, పారామెడిక్స్ మృతికి కారణమైన ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారంగా, యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య బాబ్ అల్-మందెబ్ జలసంధి ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ టియర్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 12-15 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది అత్యంత కీలకం. ఈ జలసంధిపై ఇరాన్‌కు ప్రత్యక్ష నియంత్రణ లేనప్పటికీ, యెమెన్‌లోని హౌతీల ద్వారా దీన్ని నియంత్రించే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు.
లెబనాన్, గాజాలలో ఇజ్రాయెల్ చర్యలు కొనసాగితే, తమ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ హర్మూజ్ తరహాలోనే బాబ్ అల్-మందెబ్‌లో కూడా నౌకా రవాణాను అడ్డుకుంటామని ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ స్పష్టం చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 1న అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్లను దాటింది.








