హద్దులు దాటిన క్రికెట్ పిచ్చి.. నడిరోడ్డుపై యువకుల హల్చల్
RCB: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో సంవత్సరం కూడా విజేతగా నిలవడంతో హైదరాబాద్‌లోని కొందరు అభిమానుల ఆనందం హద్దులు దాటింది. ఒక క్రీడా విజయాన్ని స్ఫూర్తితో ఆస్వాదించాల్సింది పోయి, అర్ధరాత్రి వేళ నగరంలో తీవ్ర కలకలం సృష్టించారు. సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో యువకులు ప్రవర్తించిన తీరు స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.
రహదారులపై హల్చల్ ..
మ్యాచ్ ముగిసిన వెంటనే వేలాది మంది యువకులు బైక్‌లపై ఆర్సీబీ జెండాలు పట్టుకుని ట్యాంక్‌బండ్ వైపు దూసుకొచ్చారు. సచివాలయం ప్రధాన రహదారిపై నడిరోడ్డులోనే వాహనాలను అడ్డంగా నిలిపివేసి కేకలు వేస్తూ, టపాసులు కాలుస్తూ హల్చల్ చేశారు. వీరి ప్రవర్తన వల్ల అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లే కుటుంబాలు, అత్యవసర ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే వేచి చూడాల్సి వచ్చింది. కొందరు ఆకతాయిలు ఆర్టీసీ బస్సులు, కార్లను అడ్డుకుని, వాటిపైకి ఎక్కి డాన్స్ చేశారు. అక్కడ ఉన్న పోలీసు బారికేడ్లను కింద పడేసి, వాటిని కర్రలతో కొడుతూ ధ్వంసం చేశారు. మరికొందరైతే చెట్లపైకి ఎక్కి మంటలు అంటించి, ఆ నిప్పు రవ్వలను కిందకు వెదజల్లుతూ ప్రమాదకరంగా ప్రవర్తించారు. కొందరు యువకులు టీషర్టులు విప్పేసి అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేశారు.
రంగంలోకి పోలీసులు ..
పరిస్థితి తీవ్రతను గమనించిన సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అభిమానులు వినకుండా పోలీసుల చుట్టూ చేరి డాన్స్ చేస్తూ, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆకతాయిలను చెల్లాచెదురు చేసిన అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. నిబంధనలు ఉల్లంఘించి రభస సృష్టించిన పలువురు యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.








