తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ భావోద్వేగ ప్రసంగం
సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds)లో జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. పోలీసు (Police)ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ప్రసంగించారు. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని తెలిపారు. తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా తాము ముందుకెళ్తున్నామని చెప్పారు. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా తాము అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.36కోట్ల టన్నుల పంట దిగుబడులు రావడం తమకు గర్వకారణమని వ్యాఖ్యానించారు.
రైతులకు అప్పు భారాన్ని తగ్గించేందుకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు దేశానికి ఆదర్శంగా మారారని తెలిపారు. ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.లక్ష కోట్ల రుణాలిస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.60వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశామని వెల్లడించారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉద్యోగాలు (Jobs) భర్తీ చేశామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా 67వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఈనెలలోనే టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.








