ఎన్నారైల డిమాండ్లకు మద్దతు ఇవ్వండి…
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు (NRIs) పెట్టుబడులు, రెమిటెన్సులు, వ్యవస్థాపకత, స్వచ్ఛంద సేవల రూపంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారి దీర్ఘకాలిక సమస్యలు ఆందోళనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ వహించి, ప్రత్యేక పాలసీ అమలు చేయడం ఎంతో ముఖ్యం. ప్రవాసుల సంక్షేమాన్ని కాపాడేందుకు, వారి అవసరాలను తీర్చేందుకు పలు అంశాలను పరిశీలించాలని శాన్ జోస్‌కి చెందిన సుబ్బాయంత్ర ప్రభుత్వానికి సూచించారు.
1. ప్రత్యేక ఎన్నారై పోలీస్ స్టేషన్లు..
విదేశాలలో నివసిస్తున్నప్పుడు చాలా మంది ఎన్నారైలు భారత్‌లో ఉన్న తమ వృద్ధాప్య తల్లిదండ్రుల సంక్షేమం, ఆస్తి వివాదాలు, భూ ఆక్రమణలు, న్యాయపరమైన సమస్యలకు సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎన్నారైలు, వారి కుటుంబాలకు సకాలంలో సహాయం, రక్షణ అందించడానికి ఏపీలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతిల్లో.. ఐపీఎస్ (IPS) అధికారుల నేతృత్వంలో ప్రత్యేక ఎన్నారై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వ్యవస్థలు ఇప్పటికే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో విజయవంతంగా పనిచేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
2. ఎన్నారైలకు ఆధార్ అర్హత…
ఒక ఎన్నారై ఆధార్ కార్డు పొందడానికి అర్హత సాధించే ముందు భారత్‌లో 182 రోజులు నివసించాలనే ప్రస్తుత నిబంధనను (దీనిని తరచూ 181/182 రోజుల నివాస నిబంధనగా పేర్కొంటారు) రివ్యూ చేయాలి. చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్‌లు లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు కలిగిన ఎన్నారైలకు బ్యాంకింగ్, పెట్టుబడులు, ఆస్తి నిర్వహణ, పన్నులు, మొబైల్ కనెక్షన్లు, ఇతర సేవల కోసం తరచు ఆధార్ అవసరమవుతోంది. భారత్‌లో ఎక్కువ కాలం భౌతికంగా నివసించాల్సిన అవసరం లేకుండా, కేవలం భారతీయ మూలాలు గుర్తింపు ఆధారాల ప్రకారం ఎన్నారైల కోసం సరళీకృత ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలి.
3. ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా విమాన సర్వీసులు..
ప్రవాసుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పలు రూట్లలో డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించాలి. అవేంటంటే..
దుబాయ్ నుండి విజయవాడ, విశాఖపట్నంలకు నేరుగా విమాన సర్వీసులు.
అబుదాబి నుండి విజయవాడ, విశాఖపట్నంలకు నేరుగా విమాన సర్వీసులు.
ఈ రూట్లు నార్త్ అమెరికా నుండి వచ్చే వెళ్లే ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగే ఆర్థిక కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి.
4. చట్టసభల్లో ఎన్నారైలకు ప్రాధాన్యం..
పట్టభద్రులు (గ్రాడ్యుయేట్స్), స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల మాదిరిగానే, పాలసీ రూపకల్పనలో ఎన్నారైల సమస్యలపై సరైన శ్రద్ధ చూపేలా ప్రత్యేక శాసనమండలి (MLC) స్థానాల ద్వారా ఎన్నారైలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. దీనివల్ల ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎన్నారైల సమస్యలకు వారి ఆందోళనలకు సరైన ప్రాధాన్యత లభిస్తుంది.
5. ఎన్నారై విద్యార్థులకు నీట్ నుండి మినహాయింపు..
భారత్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఎన్నారై విద్యార్థులకు ప్రత్యేక కోటాలు లేదా ప్రత్యామ్నాయ అడ్మిషన్ మార్గాలను పరిశీలించాలి. విదేశాలలో విద్యాభ్యాసం చేసిన ఎన్నారై విద్యార్థులు తరచూ భిన్న పాఠ్యప్రణాళికలు, పరీక్షా విధానాలలో చదువుకుంటారు. కాబట్టి ఎన్నారైలందరూ ఒకే విధమైన నీట్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా పోటీ పడాలని నిబంధన పెట్టేదానికంటే, ప్రభుత్వమే వారికి మినహాయింపులు లేదా ప్రత్యామ్నాయ ప్రవేశ మార్గాలను పరిశీలించడం మంచిది. తద్వారా ఎన్నారైలకు లాభం చేకూరుతుంది.








