అభివృద్ధి పథంలో తెలంగాణ : మంత్రి తుమ్మల
ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం (Kothugudem) ప్రగతి మైదానంలో జాతీయ జెండాను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని తెలిపారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సశ్యశ్యామలంగా మారేలా సీతారామ ప్రాజెక్టు (Sitarama Project) పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో ఉద్యాన పంటల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అగ్ర స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. దేశానికే తలమానికంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో స్థాపించామని ప్రస్తావించారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసి ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.








