ఇంగ్లిష్ విద్యతో సర్కారు బడులపై పెరిగిన నమ్మకం
Government Education: హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంగా మార్చేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు మరిన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నారు.
విస్తరిస్తున్న పాఠశాలలు ..
ప్రస్తుతం జిల్లాలోని బస్తీలు, కాలనీల్లో 18 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు నడుస్తుండగా, ఈ విద్యాసంవత్సరం నుండి అదనంగా మరో 40 స్కూళ్లను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పాతబస్తీ వంటి ప్రాంతాల్లోని బస్తీలలో వీటిని తీసుకురానున్నారు. ఈ స్కూళ్లను ఎంచుకునే విద్యార్థుల కోసం అర్హులైన ఇంగ్లిష్ విద్య ఉపాధ్యాయులను నియమించడంతో పాటు ఆట స్థలాలు, ఆకట్టుకునే క్లాస్ రూమ్లను సిద్ధం చేస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
అధికారుల ప్రణాళిక..
కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు గతంలోనే ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. రోహిణి తెలిపారు. కొత్తగా వచ్చిన టీచర్లలో ఎక్కువమంది ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారేనని, వారు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారని వివరించారు.
డిజిటల్ బోధన ..
మాతృభాష తెలుగు నుంచి విద్యార్థులు సులువుగా ఇంగ్లీష్ నేర్చుకునేలా డిజిటల్ పద్ధతిలో స్క్రీన్లపై పాఠాలు చెప్తారు. నిత్యం వాడే ఇంగ్లీష్ పదాలను పిల్లలతో మాట్లాడిస్తూ, వారానికి ఒకసారి అందరూ ఆంగ్లంలో సంభాషించేలా ప్రత్యేక స్కిట్లు (నాటికలు) నిర్వహిస్తారు. వారు మాట్లాడే తీరును టీచర్లు విశ్లేషిస్తారు. గత సంవత్సరం ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు మంచి స్పందన లభించడంతో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో, కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రతి పాఠశాలలో సగటున కనీసం 20 మంది విద్యార్థులను అదనంగా చేర్పించాలనే లక్ష్యాన్ని విద్యాశాఖ పెట్టుకుంది.








