అక్షయ్ కుమార్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ మూవీపై అనుమానాలు..!
బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన వెల్కమ్(Welcome) సిరీస్‌కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న వెల్కమ్ టు ది జంగిల్(Welcome to the jungle) సినిమా రిలీజ్ కు ముందే చర్చనీయాంశంగా మారుతోంది. దాదాపు 29 మంది నటీనటులతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆశలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో సహజసిద్ధమైన ఉత్సాహం మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్లతో నిండిన తారాగణం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో లేదా సాధారణ సినీ ప్రేక్షకుల్లో సినిమా గురించి పెద్దగా హైప్ కనిపించకపోవడం విశేషంగా మారింది.
మరోవైపు చిత్ర ప్రచార వ్యూహం కూడా చర్చకు దారితీస్తోంది. మార్కెటింగ్‌లో ప్రధానంగా అక్షయ్ కుమార్(Akshay kumar) ఇమేజ్‌పైనే ఆధారపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా అక్షయ్ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో, ఈ అంశం నిర్మాతలకు సవాల్‌గా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రీసెంట్ గా భూత్ బంగ్లా(Bhooth Bangla) సక్సెస్ సాధించినప్పటికీ, ఆ సినిమాకు అక్షయ్ కుమార్- ప్రియదర్శన్(Priyadarshan) కాంబినేషన్‌పై ఉన్న నాస్టాల్జియానే ప్రధాన బలం అన్న అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో ఉంది. పైగా రిలీజైన మూడు పాటల్లో రెండు పాటలు 2007లో వచ్చిన వెల్కమ్ సినిమాలను హిట్ ట్రాక్‌లను గుర్తు చేసేలా ఉండటంతో, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెబుతున్నారు.
అయితే అభిమానులను ఎక్కువగా కలవరపెడుతున్న అంశం మరోటి. ఫ్రాంచైజీకి గుర్తింపుగా నిలిచిన మజ్ను భాయ్(Majnu bhai), ఉదయ్ శెట్టి(Uday Shetty) వంటి ఐకానిక్ పాత్రలు ఈ కొత్త సినిమాలో లేకపోవడం పాత అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ పాత్రలే వెల్కమ్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని భావించే ప్రేక్షకులు, వాటి గైర్హాజరీ సినిమాపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. దీంతో వెల్కమ్ టు ది జంగిల్ భారీ స్థాయిలో రూపొందుతున్నప్పటికీ, విడుదలకు ముందే కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.








