ఆగస్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ “సిలికానాంధ్ర” 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సంబరాలకు (సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్) సిద్ధమైంది. ‘తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి’ నినాదంతో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించను న్నారు. ఆగస్టు 1, 2026న కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఓక్లాండ్ ఎరీనా వేదికగా జరగనుంది. 25 ఏళ్ల తెలుగు వారసత్వ వైభవాన్ని, ఖ్యాతిని చాటిచెప్పేలా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
ఈ మహా సమ్మేళనంలో సిలికానాంధ్ర అనుబంధ సంస్థలైన మనబడి, సంపద(మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ), రోటరీ క్లబ్ ఆఫ్ సిలికానాంధ్ర, ఏరియా యూనివర్సిటీ, రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సంకల్ప (నాటక కళా పరిషత్) భాగస్వామ్యం వహిస్తున్నాయి. సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 8వ తేదీ శనివారం నాడు కాలిఫోర్నియాలోని ఓక్ల్యాండ్ ఎరీనాలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని పాటిస్తూ సిలికానాంధ్ర సభ్యులతో కలిసి ఆయన రజతోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను స్థానిక ప్రవాస తెలుగువారి ఇంటింటికీ వెళ్లి అందజేసిన సంగతి తెలిసిందే. అమెరికా వ్యాప్తంగా ప్రవాస తెలుగువారి ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకు సిలికానాంధ్ర కుటుంబసభ్యులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆనంద్ వెల్లడించారు.
ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తెలుగు సంస్కృతిని, ప్రతిభను చాటిచెప్పేలా ఐదు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
1. శతక శంఖారావం
(పండితపామర జనరంజకం)
తెలుగు జీవితానికి బాట చూపిన అద్వితీయమైన సుమతీ శతకం, వేమన శతకాల్లోని 18 పద్యాలను కంఠస్థం చేసి, 1800 మంది తెలుగు వారు తెలుగు భాషకు మాలికలుగా సమర్పించే అరుదైన కార్యక్రమం ఇది. ఈ మహా యజ్ఞంలో పాల్గొనవలసిందిగా పిల్లలు, పెద్దలు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు.
2. జానపద జాతర
(జనం గుండెల్లో మోతరా!)
తెలుగునాట విశిష్ట ప్రాముఖ్యత కలిగిన తప్పెట గుళ్ళు, లంబాడి, కోయ, కొమ్ముకోయ, పులివేషాలు, గొండు, గుస్సాడి వంటి జానపద కళారూపాల ప్రదర్శన ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 9 నుండి 99 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా ఈ ప్రదర్శనలలో పాల్గొనవచ్చు. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది.
3. వందే భారతం
(హమారా భారత్ మహాన్)
నాటి సిపాయిల తిరుగుబాటు నుండి నేటి ఆపరేషన్ సింధూర దాకా ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వతంత్ర భారతం. ఆ వీరులను స్మరిస్తూ.. భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసే దేశభక్తి గీతాలతో, నృత్యాలతో ఆ త్యాగధనులకు సమర్పించే స్మరణార్చన నీరాజనమే ఈ “వందే భారతం” కార్యక్రమం.
4. నాటకం (జీవితాల దృశ్య రూపం)
పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాలతో అలరించిన ఎందరో రచయితలు, నటీనటులు, దర్శకుల స్ఫూర్తితో అద్భుతమైన నాటక కళను మరిన్ని తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ విభాగాన్ని నిర్వహిస్తున్నారు.
5. కళా కదంబం (వివిధ కళారూపాలు!)
64 కళలలోని విశిష్ట కళారూపాలైన ధ్వన్యనుకరుణ (మిమిక్రీ), మాయాజాలం (మ్యాజిక్), మూకాభినయం (మైమ్), గారడీ, బుడబుక్కలు, సోదెమ్మలు, గంగిరెద్దులు, జంగం దేవరలు, కోయ దొరలు వంటి విచిత్ర వేషధారణలతో కూడిన కళారూపాల ప్రదర్శన ఇందులో ఉండనుంది. దీనికి కూడా 9 నుండి 99 సంవత్సరాల వయసు గల వారు అర్హులు.
ఇలా ఎన్నో కార్యక్రమాలతో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్నాయి.








