పవన్ కల్యాణ్ సభపై కొనసాగుతున్న ఉత్కంఠ!
హైదరాబాద్ వేదికగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈరోజు నగరంలో నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ భారీ సభను నిర్వహించేందుకు జనసేన తెలంగాణ విభాగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. అయితే, చివరి నిమిషంలో సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించడంతో కథ సరికొత్త మలుపు తిరిగింది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో, ఇప్పుడు అందరి చూపు న్యాయస్థానం తీర్పుపైనే నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, తెలంగాణ రాజకీయాలపై ఇన్నాళ్లూ దృష్టి పెట్టలేదు. అయితే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవ నిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభను ఏర్పాటు చేయడం వెనుక బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని కామెంట్స్ జనసేనకు, తెలంగాణ వాదులకు మధ్య రచ్చ రాజేశాయి. తాను క్షమించి కేసులు పెట్టొద్దని చెప్పినా కూడా దీనిపై రాజకీయం చేయడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఇన్నాళ్లూ తమను విమర్శిస్తున్నా చూసీచూడనట్లు వదిలేశామని, ఇకపై బదులిస్తామని హెచ్చరించారు. ఏపీ పోలుసులు నాగేశ్వర్ ఇంటికి వెళ్లకపోయినా, అసలు నాగేశ్వర్ పై కేసులే పెట్టకపోయినా.. దీన్ని ఆంధ్రా – తెలంగాణ మధ్య వివాదంగా మలిచి ప్రెస్ క్లబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా పలువురు నోరు పారేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
దీన్ని తెలంగాణ జనసేన విభాగం తీవ్రంగా పరిగణించింది. వాళ్లకు బదులిచ్చింది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే, ఇది మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని భావించిన జనసేన, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఇలాంటి ఆరోపణలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ నవ నిర్మాణ సభను ఏర్పాటు చేసింది.
సభ కోసం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌ను వేదికగా ఎంచుకుని, జనసేన తెలంగాణ నేతలు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అభిమానులు, కార్యకర్తల కోసం భారీ బందోబస్తు, సౌకర్యాలను సిద్ధం చేశారు. అయితే, శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులను కారణాలుగా చూపుతూ సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. ఐటీ హబ్‌కు గుండెకాయ లాంటి గచ్చిబౌలి ప్రాంతంలో సాయంత్రం వేళ సభ నిర్వహిస్తే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వాదిస్తున్నారు.
పోలీసుల నిర్ణయంతో వెనక్కి తగ్గని జనసేన శ్రేణులు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే సోమవారం సమయం కుదరకపోవడంతో ఇవాళ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్నాయి. శాంతియుతంగా, ఇండోర్ స్టేడియం లేదా కన్వెన్షన్ హాల్ లోపల నిర్వహించుకునే సభకు అనుమతి నిరాకరించడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పార్టీ లీగల్ సెల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏం చెప్తుందనేదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇస్తుందా? లేక పోలీసుల నిర్ణయాన్నే సమర్థిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు జనసేన తెలంగాణ ముఖ్య నేతలు మాత్రం సభ నిర్వహణపై ధీమాగా ఉన్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, సభ నిర్వహించాలని అనుకున్న సమయం అయిన సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతి కోసం లేదా కోర్టు తీర్పు కోసం వేచి చూస్తామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాక కోసం తెలంగాణ జనసైనికులు, అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు నమ్ముతున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా, తదుపరి కార్యాచరణను అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
ఇవి కూడా చదవండి








