స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి ఎక్కిస్తే బండి సీజ్: రవాణా శాఖ
Hyderabad: మరో కొన్ని రోజుల్లో విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో బడి గంటలు మోగనున్నాయి. ప్రతి సంవత్సరం స్కూళ్లు తెరిచే సమయానికి రవాణా శాఖ వాహనాల ఫిట్నెస్ పరీక్షల హడావుడి చేయడం సాధారణమే అయినా, ఈసారి క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ చాలా నత్తనడకన సాగుతోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్నా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు.
నగరంలో 13,400 స్కూల్ బస్సులు..
గ్రేటర్ పరిధిలో మొత్తం 13,400 పాఠశాల బస్సులు ఉండగా, వాటిలో ఇప్పటివరకు కేవలం 55 శాతానికి పైగా వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ ప్రక్రియ పూర్తయినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. బస్సుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు , నిబంధనలను పాటించాల్సిన పూర్తి బాధ్యత పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఫిట్నెస్ లేకుండా నడిపినా, లేదా సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా సదరు వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
జాగ్రత్తలు..
స్కూల్ బస్సుల్లో తమ పిల్లలను పంపించే ముందు తల్లిదండ్రులు కింది విషయాలను ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను తరలిస్తుంటే పంపించకూడదు.
వాహనం ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలు, , అనుమతులను ముందుగానే పరిశీలించాలి.
వాటితో పాటు బస్సుకు సంబంధించిన పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ పత్రాలు (Pollution Certificate) సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
డ్రైవర్‌కు సరైన లైసెన్స్‌తో పాటు తగిన అనుభవం ఉండాలి. బస్సులో ఖచ్చితంగా ఒక అటెండర్ ఉండాలి (అతను డ్రైవింగ్ చేయకూడదు).
బస్సులో ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) బాక్స్, అగ్నిమాపక పరికరం ఉండాలి. అత్యవసర ద్వారం (Emergency Door) సక్రమంగా పనిచేస్తూ ఉండాలి.
బస్సు కిటికీలకు ఇరువైపులా 3 అంగుళాలకు మించకుండా ఉండేలా మూడు పైపులను అమర్చాలి.
వాహనం బ్రేకులు, టైర్లు, లైట్లు , ఇతర యాంత్రిక భాగాలు ఖచ్చితంగా బాగుండాలి.








