హరీష్ రావు పార్టీ మారడం ఖాయమా?
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ మార్పు అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు, దానికి హరీష్ రావు అంతే ఘాటుగా ఇచ్చిన కౌంటర్లతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని రోజులుగా తెరవెనుక నడుస్తున్న ఈ ప్రచారం.. ఇప్పుడు ఇద్దరు అగ్ర నేతల మధ్య బహిరంగ సవాల్‌గా మారింది.
ఇటీవల మీడియాతో నిర్వహించిన ఒక చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హరీష్ రావు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే క్లారిటీ లేదని, భవిష్యత్తులో ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, గత చరిత్రను తవ్వుతూ 2008లో హరీష్ రావు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసింది నిజం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రస్తుతం హరీష్ రావు ఎవరెవరితో టచ్‌లో ఉన్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు పూర్తి సమాచారం ఉందని సీఎం వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్ మీద ఒట్టేసి.. తాను బీజేపీలో చేరబోనని హరీష్ రావు చెప్పగలరా? అంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. తన రాజకీయ నిబద్ధత ఏంటో అందరికీ తెలుసన్నారు. “నా పుట్టుక బీఆర్ఎస్.. నా జీవితమంతా బీఆర్ఎస్.. నా చావు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే” అని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని తాను వంద సార్లు చెప్పానని, అవసరమైతే మరో వంద సార్లు చెప్పడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. జీవితాంతం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానని పునరుద్ఘాటించారు. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా నిబద్ధత గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసలు మాటలకు విలువ ఎక్కడుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన నేపథ్యంలో, హరీష్ రావు లాంటి బలమైన నేతను టార్గెట్ చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని మరింత బలహీనపరచాలనే వ్యూహంలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోంది. 2008 నాటి వైఎస్సార్ కలయిక ప్రస్తావనను తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు సీఎం ప్రయత్నించగా.. హరీష్ రావు మాత్రం తన మాతృసంస్థపై, కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని గట్టిగా చాటుకుంటూ ఆ ప్రచారానికి బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి








