కాంగ్రెస్ నేత అరాచకం.. బాధితులపై దాడి చేసి స్టేషన్లో కాళ్లు మొక్కించుకున్న వైనం
Uppal: పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారనే నెపంతో ఒక అధికార పార్టీ నేత దంపతులపై దారుణంగా దాడి చేయడమే కాకుండా, పోలీసులను అడ్డం పెట్టుకుని స్టేషన్లో వారిచేత బలవంతంగా కాళ్లు మొక్కించుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
క్రికెట్ వివాదంతో మొదలైన గొడవ..
బీహార్ ప్రాంతానికి చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ ఐడీఏ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివసిస్తూ అక్కడి ఒక ఆట్టల కంపెనీలో పనిచేస్తున్నారు. మే 25వ తేదీ సాయంత్రం లీలావతి తన ఇద్దరు పిల్లలు, మరికొందరితో కలిసి కాలనీ రోడ్డుపై క్రికెట్ ఆడుతుండగా, అదే కాలనీలో ఉండే కాంగ్రెస్ నేతకు అది నచ్చలేదు. రాత్రిపూట ఆటలేంటి అంటూ బూతులు తిడుతూ ఆయన రోడ్డుపైకి వచ్చాడు.
ఇవి కూడా చదవండి
లీలావతి దీనిని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన ఆ నేత, ఆమె బట్టలు చినిగిపోయేలా దాడికి దిగాడు. అడ్డువచ్చిన ఆమె భర్తను కూడా చితకబాదడంతో, అతని కంటి పైభాగంలో తీవ్ర గాయమై రక్తం కారింది. ఆ తర్వాత దాడి చేసిన సదరు నేత స్వయంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, రాత్రి పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి బాధితులను స్టేషన్కు తరలించారు.
అధికార బలంతో కేసు పెడతానని బెదిరింపులు..
బాధితులు తమపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, స్టేషన్ సిబ్బంది తిరస్కరించారు. ఇదే సమయంలో సదరు నేత తన అధికార బలంతో పోలీసుల సాక్షిగా దంపతులను భయపెట్టాడు. లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగిలించిందంటూ ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు తమపై దొంగతనం కేసు పెట్టవద్దని ప్రాధేయపడ్డారు. తన కాళ్లు మొక్కి, తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని ఆ నేత అర్ధరాత్రి వేళ స్టేషన్లోనే భీష్మించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు పోలీసుల ముందే అతని కాళ్లు మొక్కడంతో ఆ నేత వారిని వదలిపెట్టాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ దారుణానికి సంబంధించిన దాడి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం, అలాగే తమపై జరిగిన అన్యాయాన్ని, స్టేషన్లో ఎదురైన అవమానాన్ని వివరిస్తూ సదరు బాధిత మహిళ తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు ఆ నేతకు సహకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.








