విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనూ ‘AI’, ‘కోడింగ్’ క్లాసులు
AI Classes: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు నడుం బిగించింది. దీనిలో భాగంగా ప్రభుత్వ బడుల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు కృత్రిమమేధ (AI), కోడింగ్, , డిజిటల్ అక్షరాస్యతను నేర్పించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు, శిక్షణ వ్యూహాలను జేఎన్టీయూఏ (JNTUA) ప్రొఫెసర్ కామాక్షి ప్రసాద్ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 వేల పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రారంభించబోతున్నారు.
డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులే టీచర్లు..
ఈ డిజిటల్ విద్యా విధానంలో పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకులుగా (మెంటార్స్‌గా) వ్యవహరించేందుకు 159 డిగ్రీ కళాశాలల ఐదో సెమిస్టర్ విద్యార్థులను, అలాగే 59 పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి తోడుగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ రంగాలకు చెందిన నిపుణులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించారు.
ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతిక నైపుణ్యాలు..
విద్యార్థులలో చిన్నతనం నుంచే టెక్నికల్ స్కిల్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6వ తరగతి పిల్లలకు ఫోన్ల పరిచయం, గేమ్స్ ఆడటం వంటి ప్రాథమిక అంశాల ద్వారా ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన కల్పిస్తారు.విద్యార్థుల ఆలోచనా శైలిని గమనిస్తూ, తరగతి గదుల్లో అధ్యాపకులు పర్యవేక్షణ చేస్తారు. పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు, ఐప్యాడ్ల సహాయంతో విద్యార్థులకు నచ్చిన ప్రోగ్రామ్‌లను నేర్పిస్తారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి పిల్లల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేస్తారు.
కోడింగ్ సులువుగా చేసేలా..
పిల్లలకు కోడింగ్ అంటే ఏమిటి? దానిని ఎందుకు ఉపయోగిస్తారు? అనే విషయాలను వారి స్థాయికి తగినట్లుగా వివరించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్లను ఐటీ నిపుణుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల కంప్యూటర్లలో అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల విద్యార్థులు సొంతంగా కోడింగ్ చేసేలా శిక్షణ ఇస్తారు.
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు..
కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని జేఎన్టీయూఏ రిజిస్ట్రార్ డాక్టర్ కేవీ రావు తెలిపారు. ఏఐ పాఠాలు, డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు 10వ తరగతికి వచ్చేసరికి సాంకేతిక నైపుణ్యాలు సాధించడంతో పాటు, ఆంగ్ల భాషలో సులువుగా మాట్లాడగలుగుతారని ఆయన పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్స్, సాంకేతిక నిపుణుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








