కొందామంటే కోట్లు కావాలి.. ఉందామంటే వేలు చాలవు.. హైదరాబాద్‌లో అద్దె ఇళ్ల కష్టాలు
Hyderabad:మహానగరంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంతిల్లు కొనడం ఒక కలగానే మిగిలిపోతుండగా, కనీసం అద్దె ఇంట్లోనైనా ఉందామన్నా కిరాయిలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నగరంలో ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతున్న అద్దెల కారణంగా మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో ఇళ్లు ఎక్కువగా ఖాళీ అవుతుంటాయి. ఆ తర్వాత జూన్ నెల వచ్చేసరికి ఉద్యోగుల బదిలీలు, పిల్లలను కొత్త స్కూళ్లు, కాలేజీలలో చేర్పించడం, అలాగే ఉపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చేవారి వలసల కారణంగా అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మణికొండ వంటి ప్రాంతాల్లో ‘టులెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలో భారీ అద్దెలను భరించలేక చాలామంది ప్రజలు శివార్లకు వెళ్లిపోతున్నారు.
ఆకాశాన్ని తాకుతున్న ధరలు..
ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ పరిధిలో ఇళ్ల అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మణికొండ పంచవటి కాలనీలో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె నెలకు రూ. 40,000 నుండి రూ. 50,000 మధ్య పలుకుతుండగా, 2 BHK ఫ్లాట్‌కు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. వీకర్ సెక్షన్ ఏరియాల్లో సైతం అద్దెలు రూ. 18,000 నుండి రూ. 20,000 కు చేరాయి. బాచుపల్లిలోని కొత్త ఫ్లాట్లలో 2 BHK కిరాయి రూ. 20,000 వరకు ఉండగా, కిస్మత్పూర్లో రూ. 25,000 గా ఉంది. కేపీహెచ్‌బీ పాత ఫ్లాట్లలో సైతం రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నల్లగండ్ల, గండిపేట వంటి ఐటీ ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీలలో అద్దెలు మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ 2 BHK కి రూ. 40,000 – రూ. 50,000, అలాగే 3 BHK కి రూ. 60,000 నుండి రూ. 80,000 వరకు రెంట్ వసూలు చేస్తున్నారు. విల్లాల అద్దెలైతే ఏకంగా రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు పలుకుతున్నాయి. వీటికి అదనంగా మెయింటెనెన్స్ చార్జీల కింద రూ. 2,000 నుండి రూ. 6,000 వరకు, అలాగే కరెంట్, వాటర్ బిల్లులు అదనం.
సర్దుకుపోతున్న జనం..
నగరంలో అద్దె ఇళ్లపై ఆధారపడిన వారి పరిస్థితిని జనగణన ప్రాథమిక డేటా స్పష్టం చేస్తోంది. నగరంలోని 65 శాతం కుటుంబాలకు అద్దె ఇళ్లే ఆధారం. వీరిలో 50 శాతం కుటుంబాలకు ఈ ఇళ్ల అద్దెలు తీవ్ర ఆర్థిక భారంగా మారాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో అద్దెలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగి, ఆ ప్రభావం అద్దెలపై పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కనీసం రూ. కోటి పెడితే గానీ నగరంలో సౌకర్యవంతమైన ఇల్లు కొనే పరిస్థితి లేదు. తాము కట్టే అద్దెలు కనీసం హోమ్ లోన్ ఈఎంఐ (EMI)కి సరిపోవాలని కొందరు యజమానులు ఆశిస్తున్నారు. అద్దెలు భరించలేక జనం శివార్లకు వెళ్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజా రవాణా సౌకర్యాలను పెంచాలని, మెట్రోను విస్తరించాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.వి. రావు అభిప్రాయపడ్డారు.
మరోవైపు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, లక్షల్లో జీతాలు వచ్చే వారికి అద్దె పెద్ద సమస్య కాకపోయినా, రూ. 50,000 లోపు వేతనం వచ్చే వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఫీజులు, కుటుంబ ఆరోగ్యం కోసమే సగం జీతం ఖర్చవుతుండటంతో, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేదా శివార్లలో రూ. 10,000 లోపు దొరికే ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే ఒక ఉద్యోగి తన బడ్జెట్ పరిమితుల వల్ల ఈసీఐఎల్ నుండి రాకపోకలు సాగిస్తుండగా, కేవలం ట్రాఫిక్ కారణంగానే రోజూ 4 గంటల సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.








