యువతకు డేంజర్‌గా మారుతున్న ‘ఐబీడీ’ .. కారణాలు ఇవే!
IBD Cases: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా నగర యువత సరికొత్త ఆరోగ్య సమస్యల బారిన పడుతోంది. ఇటీవలి కాలంలో యువతలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న ఒక యువకుడు కొన్ని రోజులుగా మోషన్స్, కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, తీవ్రమైన నీరసం, బరువు తగ్గిపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదించగా.. పరీక్షల అనంతరం అతనికి ‘ఐబీడీ’ ఉన్నట్లు నిర్ధారణ అయింది. శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, మానసిక ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు గుర్తించారు.
ప్రతి నెలా 7 నుంచి 8 వరకు కొత్త కేసులు ..
పట్టణ ప్రాంత యువతలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడకం వల్ల హైపర్‌టెన్షన్ ముప్పు ఏకంగా 3 రెట్లు పెరిగినట్లు జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలింది. ఇటువంటి అలవాట్లే ఐబీడీ రావడానికి ప్రధాన కారణమవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ప్రతి నెలా 7 నుంచి 8 వరకు కొత్త ఐబీడీ కేసులు వస్తున్నాయని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కృష్ణగోపాల్ బండారి తెలిపారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం 20 నుంచి 40 ఏళ్ల వయసు గల యువకులే ఉంటున్నారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం తీసుకోకపోతే అంతర్గత రక్తస్రావం, పేగుల్లో ఇబ్బందులు, పోషకాహార లోపం, ఫిస్టులాలు, తీవ్రమైన డీహైడ్రేషన్ , క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల జీవిత నాణ్యత దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు..
- తరచూ నీళ్ల విరేచనాలు కావడం , కడుపు నొప్పి.
- మలంలో రక్తం పడటం,బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం .
- తీవ్రమైన నీరసం, జ్వరం , నిస్సత్తువ పెరగడం.
- చర్మంపై దద్దుర్లు లేదా పుండ్లు రావడం, కీళ్ల నొప్పులు, , నోట్లో పుండ్లు కావడం.
- చిన్న పిల్లల్లో ఈ సమస్య ఉంటే వారి ఎదుగుదల ఆగిపోవడం.
నియంత్రణ ..
ఐబీడీ వ్యాధికి శాశ్వతమైన చికిత్స లేనప్పటికీ, వ్యక్తిగత క్రమశిక్షణ , జీవనశైలి మార్పుల ద్వారా దీనిని పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ, బయటి జంక్ ఫుడ్‌ను, ఆయిలీ ఫుడ్స్‌ను పూర్తిగా దూరం పెట్టాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లను మానేయాలి. రోజువారీ భోజనంలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిపుణుల మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత పోషకాహారాన్ని తీసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం దీనికోసం బయోలాజిక్ థెరపీలు, టార్గెటెడ్ ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజుకు సరిపడా నిద్రపోవాలి.
ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం , క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు.








