రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ గ్లింప్స్ జూన్ 3న రిలీజ్
మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ‘ఇరుముడి’ కమర్షియల్ మాస్ ఎంటర్టైమెంట్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని చిన్నారి కుమార్తె పోస్టర్లో కనిపిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ పోస్టర్ వారి ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితర ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత కలగలిసిన ‘ఇరుముడి’ రవితేజ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుంది.








