హోం మంత్రిగా స్పీకర్ గడ్డం ప్రసాద్?
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఎట్టకేలకు కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చేవారంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని గాంధీభవన్ వర్గాల నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 16 మంది మంత్రులు ఉండగా, మరో రెండు ఖాళీలు ఉన్నాయి. అయితే కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, కొందరు మంత్రుల శాఖలను మార్చడం, పనితీరు ఆధారంగా ఒకరిద్దరిని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈసారి కేబినెట్ విస్తరణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధానాంశం.. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రివర్గంలోకి రానుండటం. గత వారం ఆయన ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పక్కా స్క్రిప్ట్ మేరకు ప్రసాద్ కుమార్ హస్తినకు వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని పార్టీ వర్గాల మాట. తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరగా, రాహుల్ గాంధీ నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్న కీలకమైన హోం శాఖను గడ్డం ప్రసాద్‌కు అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. స్పీకర్ పదవి లాంటి ఉన్నత స్థానం నుంచి తక్కువ ప్రాధాన్యత ఉన్న శాఖకు మారిస్తే విమర్శలు వస్తాయని, అందుకే హోం శాఖ ఇవ్వడమే సరైన నిర్ణయమని ఏఐసీసీ భావిస్తోంది.
తొలి విడత కేబినెట్ కూర్పులో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయా జిల్లాలకు పెద్దపీట వేయనున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని గట్టిగా ఆశిస్తున్నారు. అయితే, ఇప్పటికే కేబినెట్లో రెడ్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే విమర్శలు ఉండటంతో, అదే జిల్లాకు చెందిన ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌ను తీసుకోవడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ల విశ్లేషణ.
మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత పి. సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్ రావు, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మరికొందరు ఆశావహులు ఏఐసీసీ పెద్దల తలుపు తడుతున్నారు.
ఇప్పటికే ఉన్న కొందరు మంత్రుల శాఖల మార్పుపై కూడా రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారంలో ఏఐసీసీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో తుది సమావేశం నిర్వహించి జాబితాను ఖరారు చేయనుంది.
ఇవి కూడా చదవండి








