ఆటా మహాసభలకు భారీ ఏర్పాట్లు.. తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు ఆటా నాయకుల ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం
మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా తెలుగు మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆటా నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ఈ మహాసభలకు జరగనున్నాయి. ఈ మహాసభలకు అమెరికా నలుమÖలల నుంచి, భారత్ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని ఆటా నాయకులు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఆటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మహాసభల గురించి వివరించి ఈ మహాసభలకు అమెరికా స్థానిక గవర్నర్ లు, పలువురు నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎన్నారైలు దత్తత అంశంపై నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల సీఎంకు వివరించారు. సీఎం హోదాలో ఆటా సభలకు హాజరు కావాలని కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్‌పాల్ రెడ్డి ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆటా నాయకులు మహాసభలకు ఆహ్వానం అందజేత
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నాయకులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి, బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు భువనేష్ బూజాల, కాన్ఫరెన్స్ నేషనల్ డైరెక్టర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ లోకల్ కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి మునుకుంట్ల చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆటా నాయకులు ప్రవాసాంధ్రులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం సాధిస్తున్న అద్భుతమైన విజయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. వ్యాపార, సాంకేతిక, ప్రజా సేవా రంగాలలో తెలుగువారు మరింతగా రాణించి, ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ కమ్యూనిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆటా మహాసభలకు తనను ఆహ్వానించినందుకు ఆటా నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తన షెడ్యూల్‌ను బట్టి ఈ మహాసభలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు వారిని ఒకచోట కలిపి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహాసభలను నిర్వహిస్తున్నది. 19వ ఆటా మహాసభలు 2026 జులై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ నగరంలో జరగనున్నాయి. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, విద్యా, సేవా కార్యక్రమాలు, వ్యాపార రంగాలలో ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ నగరాల్లో మహాసభల ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆటా మహాసభలపై ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులను, ప్రముఖులను మహాసభలకు ఆహ్వానిస్తున్నారు.
డెలావేర్ వ్యాలీలో ఆటా బోర్డ్ సమావేశం
డెలావేర్ వ్యాలీ ఆటా టీం ఆధ్వర్యంలో ఇటీవల బోర్డు సమావేశం మరియు నిధుల సేకరణ (ఫండ్‌రైజింగ్) కార్యక్రమాలను మే 15, 16 తేదీలలో డెలావేర్‌లోని విల్మింగ్టన్ నగరంలో గల ‘డబుల్‌ట్రీ బై హిల్టన’ వేదికగా విజయవంతంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల సమావేశంలో కమ్యూనిటీ నాయకులు, బోర్డు సభ్యులు, వాలంటీర్లు, దాతలు మరియు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని ఒక చిరస్మరణీయమైన, ప్రభావవంతమైన వేడుకగా మార్చారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ఐక్యత, కలుపుగోలుతనం మరియు సమాజ సేవపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంస్థను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. మే 15న పెన్సిల్వేనియాలోని చాడ్స్ ఫోర్డ్లో ఉన్న ‘బావర్చి’ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఘనమైన విందుతో ప్రారంభమయ్యాయి. ఈ విందుకు సుమారు 200 మంది హాజరయ్యారు. మే 16న, ట్రస్టీల బోర్డు పూర్తి భాగస్వామ్యంతో బోర్డు సమావేశం కొనసాగింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జరగబోయే 19వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కోసం అన్ని కాన్ఫరెన్స్ కమిటీలు తమ అప్డేట్లను, ప్రణాళికలను ఈ సమావేశంలో సమర్పించాయి.
తమ ప్రియమైన వారి కోసం పెళ్లి సంబంధాలను వెతుకుతున్న వారికి ATA మ్యాట్రిమోని ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది. రెండవ తరం యువత మరియు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా కోరారు. బోర్డు సమావేశంలో మ్యాట్రిమోని కమిటీ చైర్ అనిత ముత్తోజు నిర్వహించిన మ్యాట్రిమోనియల్ సెషన్‌కు మంచి స్పందన లభించింది. ఆ తర్వాత అదే సాయంత్రం, ఆటా డెలావేర్ విభాగం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. దీనికి దాదాపు 500 మంది ఉత్సాహంగా హాజరయ్యారు. డెలావేర్, పెన్సిల్వేనియా ఆటా కమ్యూనిటీలలోని బలమైన ఐక్యత మరియు మద్దతును ఈ ఈవెంట్ ప్రతిబింబించింది. ఈ సందర్భంగా సుమారు 350,000 (3 లక్షల 50 వేల డాలర్లు) నిధుల విరాళాల హామీలు లభించాయి. ఈ అపూర్వ స్పందన ఆటా యొక్క ఆశయాలు, భవిష్యత్తు కార్యక్రమాల పట్ల కమ్యూనిటీకి ఉన్న నిరంతర అంకితభావాన్ని చాటిచెప్పింది.
ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు కాకర్ల, స్థానిక కోఆర్డినేటర్లు అరుణ్ రుద్ర, వేణుగోపాల్ రెడ్డి కొమటిరెడ్డి, కిరణ్ ఆల, హను తిరుమల, సతీష్ బండ, రమణ కోత, వేణు బండి, అనిల్ సుదామల్ల, ప్రమోద్ సంగని, వంశీ యం మధు నల్ల, రాజేష్ కొంకీస, నరేన్ ఆకుల, రవీందర్ గట్ల మరియు ఇతర స్థానిక బృందంతో కూడిన ఆటా డెలావేర్ వ్యాలీ టీమ్.. ఈ కార్యక్రమాల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, ప్రత్యేకంగా డెలావేర్, పెన్సిల్వేనియా ఆటా టీమ్‌లు, వాలంటీర్లు, దాతలు, మద్దతుదారులు మరియు కమ్యూనిటీ భాగస్వాములకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆటా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తమ నాయకత్వానికి నిరంతర మద్దతును అందిస్తున్న ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మరియు కాబోయే అధ్యక్షుడు (ప్రెసిడెంట్-ఎలెక్ట్) సతీష్ రెడ్డిలకు కూడా ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.
కథలు, కవితల పోటీలు
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2026 జులై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న “19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన” సందర్భంగా అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక సాహిత్య పోటీల నిర్వహణకు పూనుకుంది. అమ్మ భాష అభరణాలైన అక్షరాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కవులు, రచయితల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సాహిత్యాభిమానులను అలరించేలా అంతర్జాతీయ అమెరికా జాతీయ స్థాయిలో రెండు వేర్వేరు విభాగాలుగా ఈ పోటీలు సాగనున్నాయి.
ప్రపంచవ్యాప్త నవలల పోటీ 2026
ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు రచయితలైనా ఈ నవలల పోటీలో పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు నిబంధనలు ఉన్నాయి. నవలల పోటీల మొత్తం బహుమతుల విలువ 2 లక్షల రూపాయలు. నవలల నేపథ్యం ప్రపంచంలో ఎక్కడిదైనా కావచ్చు, కానీ అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి. అచ్చులో కనీసం 150 పేజీలైనా ఉండాలి. రచనలు సొంతమైనవి, అనువాదాలు కానీవి ఇదివరకు ఎక్కడా ప్రచురితం కానివై ఉండాలి. నవల ప్రతి మీద రచయిత పేరు ఉండకూడదు (పూర్తి వివరాలు ఈమెయిల్లో విడిగా రాయాలి). బహుమతి పొందిన నవలలను ప్రచురించే హక్కు ‘ఆటా’ సంస్థకు ఉంటుంది.
భట్టి విక్రమార్కతో ఆటా నాయకుల భేటీ
అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఆటా నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఆటా అటు అమెరికాలోనూ, ఇండియాలోనూ చేస్తున్న కార్యక్రమాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా. యుఎస్ -ఆటా భాగస్వామ్యం తో నిర్వహించే ఈ మహాసభల్లో పాల్గొనాలని ప్రత్యేకంగా కోరారు. ఇందుకు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎంని కలిసిన వారిలో జయంత్ చల్లాతోపాటు నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. అమెరికా పర్యటనలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సందర్శించేందుకు భట్టి విక్రమార్క ఆసక్తి చూపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆటా బృందానికి ఆయన సూచించినట్లు తెలిసింది.
కేటీఆర్‌కు ఆటా ఆహ్వానం
BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది. ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్ కు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల. ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయుల పరిస్థితులు, రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో NRI ల పాత్ర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ కార్యక్రమాలపై కేటిఆర్ చర్చించారు. TDF అప్పటి చైర్మన్ మధు రెడ్డి నల్లగొండ ఫ్లోరైడ్ పోరాటంలో మద్దతు ఇచ్చిన విషయం కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో NRIలు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడ గట్టారో వివరించారు. శరత్ వేములతో రెండు దశాబ్దాలుగా తనకు ఉన్న ఉద్యమ సంబంధాన్ని జ్ఞప్తి చేసుకున్నారు కేటీఆర్. కేటీఆర్‌ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా పాల్గొన్నారు. ఆటా మహా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.








