ఉప్పుకు ప్రత్యామ్నాయం.. ‘నిన్’ శాస్త్రవేత్తల సరికొత్త ఫార్ములా
Salt: ఆహారంలో రుచి కోసం మోతాదుకు మించి ఉప్పును వాడటం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన సోడియం వినియోగం వల్ల రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, తక్కువ సోడియం కలిగిన ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకోవడమే ఇందుకు సరైన పరిష్కారమని జాతీయ పోషకాహార సంస్థ (NIN) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పెరుగుతున్న రక్తపోటు ..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో పురుషులలో 28.2 శాతం మంది, మహిళల్లో 24.2 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతూ మందులు వాడుతున్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఈ ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి రోజువారీ ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు పరిమాణం 2 గ్రాముల కంటే తక్కువగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేస్తోంది. కానీ, మనదేశంలో ప్రజలు సగటున రోజుకు 4.4 గ్రాముల వరకు ఉప్పును తీసుకుంటున్నారు.
శాస్త్రవేత్తల ప్రతిపాదన..
సాధారణ ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం క్లోరైడ్కు బదులుగా కొంత భాగం పొటాషియం క్లోరైడ్ , ఇతర ఖనిజాలను ఉపయోగించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల రుచి మారకుండానే సోడియం వాడకాన్ని తగ్గించవచ్చు. సోడియం తగ్గి, పొటాషియం పెరగడం వల్ల రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. దేశవ్యాప్తంగా ఉప్పు వినియోగాన్ని 30 శాతం తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రత్యామ్నాయాలు ఎంతో కీలకం. మార్కెట్లో లభించే ఇలాంటి తక్కువ సోడియం ఉప్పు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఎన్ఐఎన్ (NIN) పేర్కొంది.
వంటల్లో మార్పులు ..
రోజువారీ వంటల్లో ఉప్పు పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలి. కూరల్లో ఉప్పుకు బదులుగా వెల్లుల్లి, నిమ్మరసం వాడటం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జాగ్రత్తలు..
వంటల్లోనే కాకుండా ప్యాక్ చేసిన ఆహారాలు, చిప్స్, అధిక కొవ్వు , చక్కెర ఉండే ఇతర ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరే ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు తగ్గించినప్పుడు ఆహారం చప్పగా అనిపించకుండా ఉండేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను వాడాలి. శరీరంలో పేరుకుపోయిన అదనపు సోడియంను బయటకు పంపడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం ఆకుకూరలు, బీన్స్, తాజా కూరగాయలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.








