గ్రేటర్లో EV బస్సులు.. నిరుద్యోగులకు కొలువుల పండుగ
TSRTC : హైదరాబాద్ మహానగరంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య రోజురోజుకూ విస్తరిస్తుండటంతో, ఉపాధి కోసం నగరానికి వచ్చే యువతకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మియాపూర్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ, హయాత్‌నగర్, రాణిగంజ్ డిపోల పరిధిలో నడుస్తున్న 440 ఎలక్ట్రిక్ బస్సుల కోసం నిబంధనల ప్రకారం సుమారు 1100 మంది డ్రైవర్లను నియమించారు. వీరిలో అత్యధికులు సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి పొరుగు జిల్లాల నుండి వచ్చిన వారే కావడం విశేషం. ఉపాధి లభించడంతో వీరంతా కూకట్పల్లి, బాలానగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్ డిపోల పరిసర ప్రాంతాల్లోనే తమ కుటుంబాలతో కలిసి స్థిరపడ్డారు.
కొత్త డిపోలు..
ఇటీవల కూకట్పల్లి డిపోలో కొత్తగా ప్రారంభించిన 60 బస్సుల కోసం నియామక ప్రక్రియ చేపట్టగా, మరో 150 మందికి ఉపాధి లభించింది. రాబోయే రెండు సంవత్సరాలలో గ్రేటర్ పరిధిలోకి 2 వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే డ్రైవింగ్ రంగంతో పాటు ఇతర విభాగాలలో దాదాపు మరో 5 వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
అవసరమైన అర్హతలు ..
ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే అభ్యర్థులకు హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో పాటు, డ్రైవింగ్‌లో కనీసం 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం తప్పనిసరి. అర్హత సాధించిన డ్రైవర్లకు హకీంపేట కేంద్రంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఎంపికైన వారికి జిల్లాలతో పోలిస్తే మెరుగైన జీతం, జీరో యాక్సిడెంట్ అలవెన్స్ , ఇతర సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రవాసులు ఇక్కడే స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇతర విభాగాలలోనూ అవకాశాలు..
వలం డ్రైవర్లు మాత్రమే కాకుండా టెక్నీషియన్, మెకానిక్, ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్, మేనేజ్మెంట్ (నిర్వహణ) విభాగాలలో కూడా పెద్ద సంఖ్యలో కొలువులు లభిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు ప్రత్యేకమైన బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. కాబట్టి ఈ తరహా వాహనాల సర్వీసింగ్‌లో నైపుణ్యం ఉన్న నిపుణులకు మార్కెట్లో ప్రాధాన్యత , జీతాలు పెరుగుతున్నాయి.
మౌలిక వసతుల విస్తరణ..
గ్రేటర్ పరిధిలోని ఆరు డిపోలలో ఇప్పటికే ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, రాబోయే రోజుల్లో మరిన్ని డిపోలలో ఈ వసతులను విస్తరించనున్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన , పర్యవేక్షణ కోసం అనుభవజ్ఞులైన నిపుణులను ఆర్టీసీ అధికారులు నియమించుకుంటున్నారు.








