రేవంత్ పాలనపై బీఆర్ఎస్ ‘సమరభేరి’!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహానికి పదునుపెట్టింది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, నెరవేరని హామీలను ఎండగట్టడమే లక్ష్యంగా వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సమరభేరి’ పేరుతో విస్తృత నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అయితే, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యాలపై చేసే ఆందోళన మాత్రమే కాకుండా, పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపడానికి, నిర్లిప్తతను వదిలించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన సరికొత్త రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగా, ఏదో ‘మమ’ అనిపించినట్టుగా సాగాయన్న భావన అధిష్ఠానంలో బలంగా ఉంది. దీనిపై కేటీఆర్ పార్టీ నేతలకు కుండబద్దలు కొట్టారు. సమరభేరి అనేది ఆషామాషీగా తీసుకునే సాధారణ నిరసన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. “మీరు పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటే… రాబోయే రోజుల్లో పార్టీ మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది” అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్య నాయకులకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మాటలు ప్రస్తుతం గులాబీ శిబిరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కేడర్‌ను ఎన్నికల సమరానికి ఇప్పట్నుంచే సమాయత్తం చేయాలని పార్టీ భావిస్తోంది. సమరభేరి కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా సమీక్షించి, ఎవరు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో అధిష్ఠానం నివేదికలు తెప్పించుకోనుంది. ఈ నిరసన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో విఫలమయ్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నిర్మొహమాటంగా తప్పించి, వారి స్థానంలో చురుగ్గా పనిచేసే కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.
పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి, ఆందోళనలకు రాష్ట్ర పార్టీ నిధులు సమకూర్చడం సాధ్యం కాదనే సంకేతాన్ని కేటీఆర్ పరోక్షంగా ఇచ్చారు. గత పదేళ్ల బీఆర్ఎస్ అధికారంలో వివిధ నామినేటెడ్, ప్రజాప్రతినిధి పదవులు అనుభవించిన నాయకులే ఇప్పుడు స్థానికంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను, ఖర్చులను భరించాలని స్పష్టం చేశారు. పార్టీ అధికారం ఇచ్చినప్పుడు లబ్ధి పొందినవారు, ఇప్పుడు కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మొదలవుతున్న ఈ వారం రోజుల సమరభేరి కేవలం ఒక నిరసన ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది రాబోయే ఎన్నికల కోసం బీఆర్ఎస్ చేస్తున్న అగ్నిపరీక్ష. క్షేత్రస్థాయిలో నేతల అసలైన శక్తిసామర్థ్యాలు, పార్టీ పట్ల వారి నిబద్ధతను తేల్చే లిట్మస్ టెస్ట్‌గా ఈ ఉద్యమం మారనుంది. యాక్టివ్ గా లేని కేడర్‌ను మేల్కొలిపి, నాయకుల్లో బాధ్యతను పెంచి, పూర్వవైభవం దిశగా అడుగులు వేయడమే బీఆర్ఎస్ అసలైన వ్యూహంగా కనిపిస్తోంది.








