జైల్లో దోస్తీ.. బయట దోపిడీ.. అంతరాష్ట్ర ముఠాల ‘సినిమా ఫక్కీ’ స్కెచ్
Hyderabad: సినిమా ఫక్కీలో ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులతో ముఠాలను ఏర్పాటు చేసి భారీ దోపిడీలకు పాల్పడటం ఇప్పుడు అంతరాష్ట్ర దొంగల నయా ట్రెండ్‌గా మారింది. ఒకవేళ ఎవరైనా పోలీసులకు చిక్కినా, మిగిలిన వారి గురించి ఎలాంటి సమాచారం లీక్ కాకూడదనే పక్కా వ్యూహంతో నేరగాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. జైళ్లలో ఏర్పడే పరిచయాలను వాడుకుంటూ కొత్త వ్యక్తులతో ముఠాలను తయారు చేసి, క్రైమ్ ముగిసిన వెంటనే ఆనవాళ్లు లేకుండా తప్పించుకుంటున్నారు.
జైలు నుంచే వ్యూహరచన ..
బీహార్‌కు చెందిన సుబోధ్ సింగ్ జైలులోనే ఉంటూ కరీంనగర్‌లోని ఒక బంగారు దుకాణంలో దోపిడీకి పక్కా వ్యూహం రచించాడు. ఈ నేరంలో పాల్గొన్న 13 మంది నిందితులు ఒకరికొకరు ముఖపరిచయం లేనివారే కావడం గమనార్హం. దొంగతనం పూర్తయ్యాక ఎవరికి వారు వేర్వేరు దిశల్లో పారిపోయారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు మరో షాకింగ్ నిజం తెలిసింది. సుబోధ్ సింగ్ గ్యాంగ్ హైదరాబాద్ శివార్లలోని మరో ప్రముఖ జ్యువెలరీ షాపుపై కూడా కన్నేసినట్లు విచారణలో తేలింది. జైళ్లలో పరిచయమయ్యే 21 నుండి 25 ఏళ్ల లోపు వయసున్న యువకులను ఎంచుకుని దాదాపు 50 నుండి 60 మందితో ఇలాంటి అనామక ముఠాలను తయారు చేసి రంగంలోకి దించుతున్నారు.
జూబ్లీహిల్స్ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో..
జూబ్లీహిల్స్‌లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఇంట్లో పనిమనిషిగా చేరిన నేపాల్‌కు చెందిన కల్పన అనే మహిళ ఘోరానికి ఒడిగట్టింది. యజమాని బెంగళూరుకు వెళ్లిన సమయాన్ని చూసి, ఆమె ఆయన భార్యను హతమార్చి బంగారు ఆభరణాలతో పారిపోయింది. ఈ ఘాతుకానికి కల్పన తన ప్రియుడు వికాస్ ఆదేశాలతోనే ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కూడా ఒకరికొకరు ఏమాత్రం పరిచయం లేని ఆరుగురు సభ్యులతో కూడిన అంతరాష్ట్ర ముఠా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
నేరగాళ్లకు అడ్డాగా హైదరాబాద్?
అంతరాష్ట్ర దొంగలకు హైదరాబాద్ మహానగరం ఒక పెద్ద బంగారు గనిలా కనిపిస్తోంది. ఇక్కడ పక్కాగా స్కెచ్ వేస్తే పెద్ద మొత్తంలో సొమ్ము దోచుకోవచ్చని భావిస్తున్నారు. నేరం చేశాక సులభంగా పారిపోవడానికి నగరంలో అనుకూలమైన రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉండటం దొంగలకు కలిసి వస్తోంది. గత సంవత్సరం కర్ణాటకలో దోపిడీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా కూడా తప్పించుకునే క్రమంలో హైదరాబాద్‌కే చేరుకుంది. అఫ్జల్‌గంజ్ వద్ద ప్రైవేట్ బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉన్న దొంగలను కర్ణాటక పోలీసులు గమనించగా, వారు ట్రావెల్స్ మేనేజర్ , పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో దోపిడీ చేసిన ముఠా చివరకు నేపాల్ చేరుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.
పోలీసులకు సవాలుగా మారిన రికవరీ..
దొంగిలించిన సొత్తును ముఠా నేతలు నిర్దేశించిన ప్రాంతంలో ‘రిసీవర్ల’కు అప్పగిస్తున్నారు. అక్కడే తమ మొబైల్ ఫోన్లు, ఆయుధాలను పారేసి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు.నేరగాళ్లు అంతర్జాతీయ సరిహద్దులు దాటిపోతుండటంతో వారిని తిరిగి పట్టుకోవడం, సొత్తును రికవరీ చేయడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఒకవేళ పట్టుబడి జైలుకు వెళ్లినా, అక్కడ కూడా బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ముఠా లీడర్లు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.








