స్పిరిట్ లో ఆ టాలెంటెడ్ నటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా స్పిరిట్(Spirit) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. షూటింగ్ కు సంబంధించిన ఎలాంటి ఫొటోలు లేదా వీడియోలు బయటకు రాకుండా మేకర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల నగరంలోని ఓ ఓపెన్ లొకేషన్లో కీలక సన్నివేశాలను అత్యంత గోప్యంగా షూట్ చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, షూటింగ్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ తాజా షెడ్యూల్లో సీనియర్ నటి నదియా(Nadhiya) కూడా పాల్గొనడం విశేషంగా మారింది. గతంలో మిర్చి సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన ఆమె, దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడకపోయినా, కథలో ప్రాధాన్యత కలిగిన పాత్రే అయి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిర్చిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో వివేక్ ఒబేరాయ్(Vivek Oberoi) విలన్‌గా కనిపించనుండగా, త్రిప్తి డిమ్రీ(Triptii Dimri) హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar) నిర్వహిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్పిరిట్ 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.








