అమెరికాలో మరోసారి బ్లడ్ బాత్..!
అమెరికాలో మరోసారి కాల్పులు విషాదానికి దారితీశాయి. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు.
పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో పోలీసులు, వైద్యసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటీన్కు చెందిన ర్యాన్ విల్లీస్ (52)ను నిందితుడిగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో విల్లీస్ తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. మస్కటీన్లోని ఓ నివాసంలో, గ్రాండ్వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబమని తెలుస్తోంది. కుటుంబంలో వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.








