పశ్చిమాసియా యుద్ధం కోసం రూ.5లక్షల కోట్లు.. డ్రోన్ల తయారీదిశగా అమెరికా ..!
పశ్చిమాసియా యుద్ధంలో పెద్ద ఎత్తున యుద్ధవిమానాలు , ఆయుధ వ్యవస్థలు, ఖరీదైన డ్రోన్లను నష్టపోయిన అమెరికా.. వ్యూహంలో పెద్ద ఎత్తున మార్పులు చేసింది. తన ఖరీదైన ఆయుధాలను .. ఇరాన్ చౌకైన ఆయుధాలతో ధ్వంసం చేస్తుండడంతో.. అందుకు తగినట్లు తన అమ్ముల పొదిలోనూ భారీఎత్తున చౌకబారు డ్రోన్లను చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.5 లక్షల కోట్ల వరకు వెచ్చించనున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
వివిధ కంపెనీలు, డ్రోన్ రేసర్లు ప్రారంభించిన స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడంపై దృష్టిపెట్టింది.
అగ్రరాజ్యం. దీంతోపాటు పెంటగాన్‌కు అవసరమైన డ్రోన్లు తయారుచేసే సంస్థలను ఎంపిక చేసేందుకు పోటీ పెట్టింది. దీనికి ‘డ్రోన్ డామినెన్స్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ పోటీ ద్వారా కంపెనీలకు 1.1 బిలియన్ డాలర్లు సమకూర్చి 3,00,000 డ్రోన్లను తయారుచేయిస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన నీరోస్ కంపెనీ, బ్రిటన్‌కు చెందిన స్కైకట్టర్స్ ఈ రకం డ్రోన్ల తయారీ రేసులో ముందంజలో ఉన్నాయి.
ఇప్పటికే ట్రంప్ కార్యవర్గం 54.6 బిలియన్ డాలర్లు (రూ.5 లక్షల కోట్లకు పైగా) వచ్చే ఏడాది రక్షణ బడ్జెట్ నుంచి సమకూర్చుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు పెంటగాన్ మొదలుపెట్టిన పోటీల్లో పరీక్షించిన డ్రోన్లు ఒక్కోటి సుమారు 5,000 డాలర్లు మాత్రమే. యుద్ధంలో వీటిని కోల్పోయినా పెద్దగా నష్టం ఉండకుండా చూసుకొంటోంది. ఈ పోటీలకు వచ్చిన డ్రోన్లను సైనిక సిబ్బంది వాస్తవ యుద్ధ రంగ పరిస్థితులకు అనుగుణంగా పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో సుదూర లక్ష్యాలు, నిర్మాణాల్లో ఉండే టార్గెట్లపై ప్రయోగించారు. ఇప్పటివరకు జరిగిన తొలిరౌండ్లో 26 కంపెనీలు పోటీపడగా, బ్రిటన్‌కు చెందిన స్కైకట్టర్ విజేతగా నిలిచింది. దీంతో ఈ కంపెనీకి 2,500 డ్రోన్ల తయారీకి ఆర్డర్ లభించింది.








