ఆ కాలేజీలకు అమెరికా ‘ప్రిన్స్టన్’ వర్సిటీతో సంబంధం లేదు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
Supreme Court: తెలంగాణలో ‘ప్రిన్స్టన్’ పేరుతో నడుస్తున్న విద్యాసంస్థలకు, అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రముఖ ‘ప్రిన్స్టన్ యూనివర్శిటీ’తో ఎటువంటి అనుబంధం లేదని బహిరంగంగా ప్రకటించాలని వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..
ప్రిన్స్టన్ అనే పేరును వాడుకుంటూ కాలేజీలను నిర్వహిస్తూ, తమ అధికారిక ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేస్తున్న వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్శిటీ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అంతర్జాతీయ విద్యాసంస్థల పేర్లను ఇక్కడ వాడుకుంటూ కాలేజీలు నడిపితే విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
గట్టి నిబంధనలు విధించిన కోర్టు..
భవిష్యత్తులో విద్యార్థులు ఇటువంటి పేర్లను చూసి తప్పుదోవ పట్టకుండా ఉండటం కోసం కోర్టు గట్టి నిబంధనలు విధించింది. తెలంగాణలో ప్రిన్స్టన్ పేరుతో నడుస్తున్న ఆరు కాలేజీలకు, అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీకి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ తమ అధికారిక వెబ్సైట్లో స్పష్టంగా ఉంచాలని ఆదేశించింది. దీనితో పాటు, తెలంగాణ వ్యాప్తంగా సర్క్యులేట్ అయ్యే ప్రముఖ దినపత్రికల్లో కూడా ఈ విషయానికి సంబంధించిన బహిరంగ ప్రకటనలను (నోటీసులను) ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.








