ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ బెస్ట్ స్కీమ్.. పన్ను లేకుండా రూ.70 లక్షలు పొందే ఛాన్స్
Sukanya Samriddhi Yojana: మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ముందే డబ్బు దాచడం ఒక పెద్ద బాధ్యత. అలాంటి తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY). మార్కెట్లో ఉన్న ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఇందులో అత్యధిక వడ్డీ లభించడమే కాకుండా, వచ్చే ఆదాయంపై పైసా కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. చక్రవడ్డీ (కాంపౌండింగ్) ప్రయోజనం ఉండటం వల్ల ఈ స్కూమ్ ద్వారా మీ పాప పేరిట భారీ నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
పెట్టుబడి పరిమితులు..
అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి పదేళ్ల లోపు వయసున్న బాలికల పేరు మీద ఈ ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన రోజునుంచి 15 ఏళ్ల పాటు డబ్బులు కట్టాలి. ఆ తర్వాత కట్టకపోయినా 21 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ముగిసేవరకు వడ్డీ వస్తూనే ఉంటుంది. పాపకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అకౌంట్లో ఉన్న మొత్తంలో 50 శాతం డబ్బును ముందే డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
గరిష్ఠంగా రూ.70 లక్షల నిధి..
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) కంటే ఇది చాలా ఎక్కువ. పాప పుట్టిన వెంటనే ఈ పథకంలో చేరి, సంవత్సరానికి రూ.1.50 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు గరిష్ఠ పరిమితిని డిపాజిట్ చేస్తే.. 21 ఏళ్లు నిండేసరికి ఆ నిధి ఏకంగా రూ.70 లక్షలు అవుతుంది. ఇందులో తల్లిదండ్రులు కట్టే అసలు మొత్తం రూ.22.5 లక్షలు కాగా, మిగిలిన రూ.40 లక్షలకు పైగా కేవలం వడ్డీ రూపంలోనే లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ..
సంవత్సరానికి రూ.1.50 లక్షలు ఒకేసారి కట్టలేని వారు.. తమ స్తోమతను బట్టి నెలవారీగా లేదా వార్షికంగా చిన్న మొత్తాలతో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటి సంవత్సరం నుంచే నెలకు రూ.1,800 (లేదా ఏడాదికి రూ.20,000) జమ చేయాలి. రూ.25 లక్షల లక్ష్యం కోసం.. నెలకు రూ.4,500 (లేదా ఏడాదికి రూ.52,000) చొప్పున పొదుపు చేసుకుంటూ వెళ్లాలి.
ఖాతా తెరవడం ఎలా?
ఈ అకౌంట్‌ను మీకు దగ్గరలోని పోస్టాఫీసులో గానీ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో గానీ సులభంగా ఓపెన్ చేయవచ్చు. దీనికోసం కింద పేర్కొన్న డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
- బాలిక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (Birth Certificate).
- తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఐడీ ప్రూఫ్, పాన్ కార్డ్ (PAN Card).
- పాప , తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
- అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కనీస డిపాజిట్ సొమ్ము రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
ట్యాక్స్ బెనిఫిట్స్..
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు (Tax Exemption) లభిస్తుంది. వీటన్నింటికీ మించి, స్కీమ్ ముగిసిన తర్వాత చేతికి వచ్చే మెచ్యూరిటీ అమౌంట్‌పై కూడా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఆడపిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు ఇదొక సురక్షితమైన , ఉత్తమమైన మార్గం.








