వానలపై హైడ్రా అలర్ట్.. నిఘా కోసం వందల బృందాలు సిద్ధం
HYDRA: భాగ్యనగరంలో స్వల్ప వర్షం కురిసినా సరే రహదారులన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇలా నీరు నిలిచే 899 సమస్యాత్మక ప్రాంతాలను హైడ్రా అధికారులు గుర్తించారు. గత వర్షాకాలంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కుండపోత వానలు పడినా తట్టుకునేలా జీహెచ్ఎంసీ, సీసీఎంసీ (సైబరాబాద్ నగరపాలక సంస్థ), ఎంఎంసీ (మల్కాజ్గిరి నగరపాలక సంస్థ)లు సంయుక్తంగా వర్షాకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాయి. లోతట్టు ప్రాంతాల్లో ముంపు నివారణ, విపత్తుల నుంచి నగరవాసులను రక్షించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 523, సీసీఎంసీ పరిధిలో 202, ఎంఎంసీ పరిధిలో 174 ప్రాంతాల్లో నీరు నిలుస్తున్నట్లు తేలింది.
ప్రత్యేక సిబ్బంది..
ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న జీహెచ్ఎంసీ లోని 150 డివిజన్లు, సీసీఎంసీ లోని 76 డివిజన్లు, ఎంఎంసీ లోని 74 డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ఒకటి చొప్పున వర్షాకాల అత్యవసర బృందాన్ని (Monsoon Emergency Team – MET) నియమించాలని హైడ్రా నిర్ణయించింది. దీని ప్రకారం మొత్తం 300 ఈఆర్టీ బృందాలు త్వరలోనే క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ బృందాలు రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలు, నాలాల్లోని పూడికమట్టి, రాళ్లు, ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాయి. నీరు నిలిచే ముంపు ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించనున్నారు.
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు..
వర్షం పడుతున్న సమయంలో ఎక్కడికక్కడ నీటిని వేగంగా దారి మళ్లించడం కోసం మూడు కార్పొరేషన్లు కలిపి 889 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను (SST) రంగంలోకి దించుతున్నాయి. ఈ సిబ్బంది వర్షం కురిసే సమయంలో ముంపు ప్రాంతాల్లోనే ఉంటూ సహాయక చర్యలు చేపడతారు. ఇవి కాకుండా హైడ్రా ఆధ్వర్యంలో 300 డివిజన్లలో 51 ప్రత్యేక బృందాలు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తాయి.
కొత్త బోట్ల కొనుగోలు..
నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల నుంచి వరదను వేగంగా కిందికి పంపేందుకు భారీ మోటార్లను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే హైడ్రా , కార్పొరేషన్ల వద్ద వివిధ సామర్థ్యాలు (25, 12, 10, 8, 6.5 హెచ్‌పీ) గల 235 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అదనంగా మరో 150 మోటార్లను (25 హెచ్‌పీ, 12.5 హెచ్‌పీ సామర్థ్యం గలవి), అలాగే అత్యవసర సహాయక చర్యల కోసం ఆరు కొత్త బోట్లను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
1,450 మంది ఆపద మిత్ర వాలంటీర్లు..
నగరంలో వరదలు, విపత్తు సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, రక్షణ చర్యలపై ప్రత్యేక శిక్షణ పొందిన 1,450 మంది ‘ఆపద మిత్ర’ వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని హైడ్రా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో నగర ప్రజలు సంప్రదించాల్సిన హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్లు 90001 13667, 87124 06901 , టోల్ ఫ్రీ నంబర్ 1070 అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.








