క్వాంటమ్ వ్యాలీ ఫ్రేమ్ వర్క్ లో భాగస్వామ్యం వహించండి : నారా లోకేష్
జలరవాణా మార్గాల్లో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించండి
సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్ ( Tagir sitdekov ) తో భేటీలో ఏపీ మంత్రి నారా లోకేష్
సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్ ( Tagir sitdekov ) తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… భారత్ లో అంతర్గత జలరవాణా, స్మార్ట్ ఫ్లీట్ నిర్వహణ కోసం జాతీయ జలరవాణా మార్గాల్లో ఒక ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించండి. ప్రధాన ఓడరేవుల్లో ఒకచోట అసెంబ్లింగ్ సదుపాయాలను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించండి. భారత్ లో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా భారీపరిశ్రమల అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా పైలట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయండి. భారత్ లోని ఇస్రో మౌలిక సదుపాయాల సమీపంలో రాబోయే హైటెక్ క్లస్టర్లలో ఒక జాయింట్ స్మాల్ శాటిలైట్, గ్రౌండ్ స్టేషన్ సదుపాయాన్ని నిర్మించండి.
అటానమస్ సీ షిప్ యార్డు, తీరప్రాంత పర్యవేక్షణ కోసం ఏఐ విశ్లేషణలకు సహకారం అందించండి. భారతదేశం అంతటా స్మార్ట్ ఈవి చార్జింగ్ నెట్ వర్క్ లు, డేటా ప్లాట్ ఫారమ్ లను ఏర్పాటుచేయండి. దక్షిణ భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణరంగ మార్కెట్ లో సేవలు, ఆంధ్రప్రదేశ్ పోర్టుల ద్వారా వచ్చే ముడిసరుకు దిగుమతులను ఉపయోగించి సిమెంట్, వ్యవసాయ రంగాల కోసం కాగితపు ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ, లోకలైజేషన్ కు సహకరించండి. క్వాంటమ్ వ్యాలీ ఫ్రేమ్ వర్క్ కింద అనుసంధానమైన అధునాతన సైబర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వ్యవస్థలు, ఎఐ ఆధారిత పట్టణ పరిపాలన సాధనాలను భారతదేశం అంతటా అమలు చేయడంలో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్
దేకోవ్ ( Tagir sitdekov ) మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ఎకోసిస్టమ్, లెండింగ్ కార్ట్ ఎస్ఎంఇ ఫైనాన్సింగ్, టెక్ ఆధారిత సప్లయ్ చైన్ వంటి పెట్టుబడి మద్దతు సేవలను తాము ఇప్పటికే అందిస్తున్నామని చెప్పారు. భారత్ లోని న్యూ డిల్లీ శాఖ ద్వారా సిస్టమా వెంచర్ క్యాపిటల్ విభాగం గ్రోత్ క్యాపిటల్, మార్కెట్ విస్తరణ, నెట్ వర్క్ లను వినియోగించి పెట్టుబడుల కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫిన్ టెక్, హెల్త్ టెక్, కన్వర్సేషనల్ ఎఐ రంగాల్లో స్టార్టప్ లకు తమ సంస్థ నిధులు సమకూరుస్తుంది. గ్రోత్ ఈక్విటీ వ్యూహంలో భాగంగా లిషియస్, రెబల్ ఫుడ్స్, రెండింగ్ కార్ట్ వంటి కొత్తతరం మార్కెట్ లీడింగ్ సంస్థల్లో సంస్థాగత మూలధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం. భారత్ లోని విభిన్నరంగాల్లో క్రాస్ బోర్డర్ మార్కెట్ ఇంటిలిజెన్స్, ఆర్థిక స్థిరత్వంతో కూడిన కార్యకలాపాలకు భారత్ లో మద్దతు ఇస్తున్నాం. ఏపీ మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్
దేకోవ్ ( Tagir sitdekov ) హామీ ఇచ్చారు.
సిస్టమా సంస్థ గురించి..
సిస్టమా సంస్థ టెలికం, ఈ-కామర్స్, టింబర్, హెల్త్ కేర్ రంగాల్లో రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ ఉద్యోగ కల్పన సంస్థల్లో ఒకటి. 80 మిలియన్లకు పైగా టెలికాం కస్టమర్లు, లక్షలాది డిజిటల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.








