ఎస్ పీఐఈఎఫ్ (SPIEF) బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్ ప్రసంగం
సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): భారత్ – రష్యా నడుమ ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఉంది. ప్రపంచంలో ఇది చిరస్థాయిగా నిలబడిన స్నేహం. ఇది వ్యాపార ఒప్పందాలు, దౌత్య నిఘంటువులను మించినది. ప్రపంచం అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా ధృడంగా నిలబడిన బంధమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం (SPIEF) వేదికగా జరిగిన రష్యా-ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారతదేశ అభివృద్ధి యాత్రలో కీలక దశల వద్ద రష్యా భారత్ కు తోడుగా నిలిచింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్, కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం, గగన్‌యాన్, బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రష్యా భారతదేశానికి అండగా నిలచింది. ఈ పునాది రాత్రికి రాత్రి నిర్మించడం సాధ్యమయ్యేదికాదు. దానిని కాపాడుకుంటూ మరింత బలంగా ఇరుదేశాలు ముందుకు సాగాలి.
నేను ఈ ఫోరమ్‌లో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు గొప్ప గౌరవం ఉంది. నేను ఇక్కడకు రావడానికి కారకులైన భారత ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీజీకి ధన్యవాదాలు చెబుతూ వారి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రాల్లో ఒకటి, ప్రస్తుతం మా జీడీపీ సుమారు 215 బిలియన్ డాలర్లు కాగా, 2047నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
బోధనలు పక్కనబెట్టి వాస్తవ ఫలితాల గురించి నేను మాట్లాడతాను. మన రెండు దేశాల భాగస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ మా రాష్ట్రంలోనే ఉంది. ఏపీలో రుసాల్ (RUSAL) సంస్థ 1.5 మిలియన్ టన్నుల పయనీర్ ఆల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టింది. మరో ప్రాజెక్టు నయారా ఎనర్జీ — భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీలలో ఒకటైన నయారాలో రోస్నెఫ్ట్ మెజారిటీ వాటాను కలిగి ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని వడినార్ రిఫైనరీ రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. దేశవ్యాప్తంగా 6,500కు పైగా ఇంధన కేంద్రాలు భారతీయ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాదు – ఇవి ప్రస్తుతం అభివృద్ధి సాధిస్తున్న పారిశ్రామిక భాగస్వామ్యాలు. మనం ఇంకా చేయాల్సిన పనులకు ఇదొక నమూనా. భారత్ – రష్యా కలిసి ఇలాంటి మరిన్ని భాగస్వామ్యాలను ఏర్పరచుకోగలవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అణుశక్తి, ఎల్ఎన్ జీ, చమురు అన్వేషణ, పెట్రోకెమికల్స్, ఏరోస్పేస్, మౌలిక సదుపాయాల రంగాలలో వాస్తవమైన నిబద్ధతలతో ఆ ఆశయానికి మద్దతు లభిస్తోంది. ఆ భవిష్యత్తులో నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన భాగంగా కావాలని కోరుకుంటోంది.
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఓడరేవులు, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి ఒక ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం. మాకు 1,053 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. ఇది భారతదేశంలో రెండవ అతి పొడవైనది. ప్రపంచవ్యాప్త అనుసంధానంతో పనిచేస్తున్న ఆరు ఓడరేవులు, పటిష్టమైన రోడ్డు, రైలు నెట్‌వర్క్‌లు, భారీ పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకులు, నమ్మకమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా, పెరుగుతున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, పెట్టుబడిదారులకు మద్దతునిచ్చే అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని ప్రత్యేకస్థానంలో నిలుపుతున్నాయి.
మేము అత్యంత గర్వపడేది కాగితాలపై విధానాల గురించి కాదు – క్షేత్రస్థాయిలో అమలు తీరు గురించే. బలమైన ప్రభుత్వ మద్దతుతో మా రాష్ట్రంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయి. ఒక పెట్టుబడిదారుడు మావద్దకు రావడానికి ఆసక్తి చూపినప్పుడు వేగంగా స్పందించడంలో మాకు పేరుంది. ఆ వేగం చాలా ముఖ్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మేము సీరియస్ గా పరిగణిస్తాం.
ఇప్పుడు మా భాగస్వామ్యంలో నాకు అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచే అంశం గురించి మాట్లాడతాను – అదే అంతరిక్షం. భారతదేశ అంతరిక్ష యాత్రకు రష్యానే నాంది పలికింది. 1975లో సోవియట్ రాకెట్ ద్వారా ఆర్యభట్టను ప్రయోగించినప్పుడు అది ఒక అసాధారణమైన ఆరంభం. దశాబ్దాల తర్వాత, మన గగన్‌యాన్ మానవ అంతరిక్ష యాత్ర కోసం రోస్కోస్మోస్ సంస్థ గగరిన్ వ్యోమగామి శిక్షణా కేంద్రంలో భారతీయ వ్యోమగాములకు శిక్షణనిచ్చింది. ఆ యాత్రకు అవసరమైన కీలక సిబ్బంది, వ్యవస్థలను సరఫరా చేసింది. ఆ చరిత్ర ఈనాటికీ సజీవంగా ఉంది.
అధునాతన రాకెట్ ఇంజిన్ల లైసెన్స్ ఉత్పత్తి, ఆర్బిటల్ స్టేషన్ల సంయుక్త అభివృద్ధి, భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని రష్యన్ ఆర్బిటల్ స్టేషన్‌తో ఒకే కక్ష్య వాలులో అనుసంధానించడం వంటి అంశాలపై రోస్కోస్మోస్, ఇస్రో ఇప్పుడు చురుకైన చర్చలు జరుపుతున్నాయి. దీనివల్ల భూమికి సమీప కక్ష్యలో నిరాటంకమైన దీర్ఘకాలిక సహకారం సాధ్యమవుతుంది. ప్రధానమంత్రి మోదీ చెప్పినట్లుగా… అంతరిక్షంలో మన సుదీర్ఘ అనుబంధం కొత్త శిఖరాలను చేరుకుంటోంది.
భారతదేశపు ఏకైక కార్యాచరణ అంతరిక్ష కేంద్రం… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఈనేల నుండి 100కు పైగా అంతరిక్ష ప్రయోగ యాత్రలు జరిగాయి. దాని ఆధారంగా మేము స్పేస్ పాలసీ 4.0ని, దాంతో రెండు ప్రత్యేక స్పేస్ సిటీలను ఆవిష్కరించాం. పరిశోధన, ఉపగ్రహ అభివృద్ధి, డీప్-టెక్ ఆవిష్కరణల కోసం రాష్ట్రంలో మేము అనేక అంతరిక్ష నగరాలను నిర్మిస్తున్నాం.
తిరుపతి స్పేస్ సిటీ – శ్రీహరికోటకు నేరుగా రోడ్డు మార్గంలో అనుసంధానమై ఉన్న 2,800 ఎకరాల విస్తీర్ణంలో ఇది నెలకొని ఉంది, ప్రయోగ వాహనాల అసెంబ్లింగ్, ఉపగ్రహాల తయారీ, ఏవియానిక్స్ ఉత్పత్తి కోసం దీనిని నిర్మిస్తున్నాం. స్పేస్ సిటీల ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 5వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 30వేల పరోక్ష ఉపాధి అవకాశాలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భారతదేశ అంతరిక్ష రంగం ఇప్పటికే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తోంది.
ఈ రోజు ఇక్కడ ఉన్న రష్యన్ భాగస్వాములకు నేను ఓ విషయాన్ని నేరుగా చెబుతున్నాను: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలనుకునే రోస్కోస్మోస్ టెక్నాలజీ భాగస్వాములకు, ప్రొపల్షన్ కంపెనీలకు, శాటిలైట్ ఇంటిగ్రేటర్లకు, స్పేస్-టెక్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ సహజసిద్ధమైన గమ్యస్థానం.
ఏరోస్పేస్, ఇంధనం, సెమీకండక్టర్లు, మైక్రోఎలక్ట్రానిక్స్, ఏఐ, కమోడిటీస్ రంగాల్లో కూడా ఇటువంటి అవకాశాలే అవకాశం ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద భారతదేశం దేశీయ తయారీని విస్తరిస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ విడిభాగాలు, ఏవియానిక్స్, డ్రోన్లు, నావికా వ్యవస్థలు, సెమీకండక్టర్ల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు సమీపంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ చుట్టూ ఈ ఏర్పాటు జరుగుతోంది. ఇది పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అసాధారణమైన ఇంజనీరింగ్ ప్రతిభతో ఇంటిగ్రేట్ చేస్తుంది. రష్యన్ ఏరోస్పేస్, సెమీకండక్టర్ సంస్థలకు ఒక ప్రత్యేకమైన, సమీకృత గమ్యస్థానంగా ఆంద్రప్రదేశ్ నిలుస్తోంది.
నేటి ప్రపంచం విశ్వసనీయమైన సంబంధాలకే విలువనిస్తుంది. భారత్ – రష్యాల నడుమ ఆ విశ్వాసం ఉంది. మనం ఇప్పుడు కలిసి నిర్మించాల్సింది భవిష్యత్తునే. ఆంధ్రప్రదేశ్… రష్యా పరిశ్రమలు, అంతరిక్ష సంస్థలు, ఇంధన సంస్థలు, సాంకేతిక సంస్థలు, అధునాతన తయారీదారులకు కేవలం పెట్టుబడిదారులుగా మాత్రమే కాకుండా, భూమి, సముద్రం, గగనంలో శాశ్వతంగా నిలిచిపోయే వ్యవస్థల నిర్మించడంలో దీర్ఘకాలిక భాగస్వాములుగా రావాలని హృదయ పూర్వకస్వాగతం పలుకుతోంది. 1975లో ఆర్యభట్టతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం తన తదుపరి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదురుచూస్తున్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.








