4th June 2026

__________

- Saidulu

మొక్కల పెరుగుదలకు సహజ టానిక్..జీవామృతం..

జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రీయ ద్రావణంగా గుర్తింపు పొందింది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ మిశ్రమం మొక్కల పెరుగుదలను వేగవంతం చేయడంతో పాటు నేల సారాన్ని కూడా పెంచుతుంది.

జీవామృతం తయారీకి 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం అవసరం.అదనంగా 2 కిలోల బెల్లం, 2 కిలోల శనగపిండి కూడా సిద్ధం చేసుకోవాలి.

ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్‌లో సుమారు 200 లీటర్ల నీటిని తీసుకోవాలి. అందులో ఆవు పేడ, ఆవు మూత్రాన్ని బాగా కలపాలి.మీ అవసరాన్ని బట్టి తగ్గిన మోతాదులో ఇది తయారుచేసి నిల్వ చేసుకోవచ్చు.

తర్వాత బెల్లం, శనగపిండితో పాటు 1 కిలో పొలం మట్టిని జోడించాలి. ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు కర్రతో కలపాలి. దీంతో కిణ్వ ప్రక్రియ వేగంగా జరిగి జీవామృతం సిద్ధమవుతుంది.

సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత జీవామృతం ఉపయోగించడానికి సిద్ధమవుతుంది.అప్పుడు దీనిని మొక్కల వేర్ల వద్ద లేదా నీటితో కలిపి వాడవచ్చు.

జీవామృతం మొక్కలకు అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తుంది.దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి.

ఇది నేలలోని సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి భూమి సారాన్ని మెరుగుపరుస్తుంది. రసాయన ఎరువుల అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారయ్యే ఈ సహజ ద్రావణం టెర్రస్ గార్డెన్ నుంచి వ్యవసాయ పొలాల వరకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.