తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు : హోం మంత్రి అనిత హెచ్చరిక
బ్రిడ్జి స్పోర్ట్స్ ను కేంద్రం అథరైజ్డ్ చేసిందని, ఆయితే ఆ కోటాలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదని హోం మంత్రి అనిత (Anita) తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆమె మాట్లాడారు. డీఎస్సీ (DSC)లో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్పిందని వైసీపీ నేతలను ప్రశ్నించారు. 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. బట్ట కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేం. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) తప్పవు అని హెచ్చరించారు. డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు . చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఎన్నో డీఎస్సీలను నిర్వహించారన్నారు.
రాష్ట్రంలో సుమారు 3.11 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే వారిలో దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఆయన హయాంలోనే ఉద్యోగాలు సాధించారని తెలిపారు. డీఎస్సీ 2025ను 240 కేసులకుపైగా దాటుకుని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. డీఎస్సీపై 3 స్థాయిల్లో గ్రీవెన్సు నిర్వహించి, గ్రీవెన్స్ లో 34 వేలకుపైగా ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించాం. ఏ కోర్టు కేసు అడ్డంకి రాకుండా అన్ని సమస్యలు పరిష్కరించి గౌరవ ప్రదంగా నియామకపత్రాలు అందజేశాం అని చెప్పారు. డీఎస్సీపై వైసీపీ (YCP) నేతలు ఆది నుంచి విష ప్రచారమే చేశారన్నారు. స్పోర్ట్స్ కోటా అయినా విద్యార్హతలు మాత్రం తప్పనిసరి. అవి కూడా 15 మంది సభ్యుల బృందం పరిశీలించి ఎంపిక చేసింది అని అన్నారు.








