పూజల్లో కలశం ఎందుకు పెడతారో తెలుసా? ఈ స్థాపన వెనుక ఉన్న అంతరార్థం ఇదే
Kalash Sthapana: హిందూ సంప్రదాయంలో నిర్వహించే ఏ పూజా కార్యక్రమాల్లోనైనా కలశ స్థాపనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సకల దేవతలను పూజా స్థలానికి ఆహ్వానించడానికి దీనిని ఒక పవిత్ర సంకేతంగా భావిస్తారు. సాధారణంగా వెండి, రాగి లేదా ఇత్తడితో చేసిన చెంబులో శుభ్రమైన నీటిని నింపి, దానిపై కొబ్బరికాయను ఉంచుతారు. ఆ కొబ్బరికాయ చుట్టూ మామిడి ఆకులను అమర్చి కలశాన్ని సిద్ధం చేస్తారు.
కలశంలో త్రిమూర్తుల కొలువు..
“కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః మూలే స్థితో బ్రహ్మ” అనే శ్లోకం ప్రకారం కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశం పైభాగం (ముఖం) లో శ్రీమహావిష్ణువు, మధ్యభాగం (కంఠం) లో పరమశివుడు, , కింది భాగం (అడుగు భాగం) లో బ్రహ్మదేవుడు నివాసం ఉంటారని భక్తుల నమ్మకం. అలాగే, కలశంలో పోసే నీటిని కేవలం నీరుగా కాక పవిత్ర గంగాజలంతో సమానంగా గుర్తిస్తారు. కలశాన్ని ప్రతిష్టించిన పూజా పరిసర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శక్తితో, పవిత్రతతో సంతరించుకుంటుంది.
కీలకమైన ఆధ్యాత్మిక మాధ్యమంగా..
ఆధ్యాత్మిక కోణంలో కలశం అనేది సంపూర్ణత్వానికి ఒక రూపం. కలశ పాత్రలోని నీరు ప్రాణశక్తిని సూచిస్తే.. పైన ఉంచే కొబ్బరికాయ దైవత్వానికి, చుట్టూ ఉండే మామిడి ఆకులు ప్రకృతికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ నీరు, కొబ్బరికాయ, మామిడి ఆకుల కలయిక సంపూర్ణ సృష్టిని సూచిస్తూ, సమస్త విశ్వాన్ని ఒకే పాత్రలో ఆవిష్కరిస్తుంది. పూజా సమయంలో కలశ స్థాపన చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తులు (నెగటివ్ ఎనర్జీ) తొలగిపోయి, దైవిక శక్తులు ప్రసరిస్తాయి. ఏవైనా శుభకార్యాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా, నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి కలశ స్థాపన అనేది అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక మాధ్యమంగా పనిచేస్తుంది.








