భారీగా పెరిగిన ఫీజులు.. అయినా తగ్గని హెచ్ 1బీ వీసా డిమాండ్
H-1B Visa: అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజులను భారీగా పెంచినప్పటికీ, సాంకేతిక నిపుణులను రప్పించుకునేందుకు కంపెనీలు, వ్యక్తులు అస్సలు వెనకాడటం లేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి (FY 2026) సంబంధించి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 2.86 లక్షల హెచ్ 1బీ వీసా దరఖాస్తులు అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగానికి (DHS) అందడం దీనికి నిదర్శనం.
లక్ష డాలర్ల అదనపు ఫీజుకు కూడా సై..
మొత్తం దరఖాస్తుదారులలో సుమారు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు అదనపు ఫీజులను చెల్లించడానికి కూడా సిద్ధపడ్డారు. వృత్తిపరమైన అవసరాల కోసం ఏకంగా లక్ష డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 95 లక్షలు) అదనంగా కట్టేందుకు కూడా వీరంతా సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కీలకమైన వివరాలను యూఎస్ సెనేట్ సబ్ కమిటీ ముందు జరిగిన సమావేశంలో డీహెచ్ఎస్ (DHS) సెక్రటరీ మార్క్వేన్ ముల్లిన్ స్వయంగా వెల్లడించారు.
అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోసం, ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం కోసం అంతర్జాతీయ స్థాయిలో హెచ్-1బీ వీసాలకు ఉన్న డిమాండ్ ఈ ఫీజుల పెంపు తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.








