ఏఐ మోడళ్లపై ట్రంప్ ముందస్తు నిఘా.. మార్కెట్లోకి వచ్చే ముందే తనిఖీలు
Trump: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) రంగంలో వస్తున్న అత్యాధునిక మోడళ్లు దేశ రక్షణకు ఉపయోగపడేలా ఉన్నాయా? లేదా ఏవైనా ప్రమాదాలను తెచ్చిపెట్టేలా ఉన్నాయా? అనే విషయాలను ముందుగానే స్క్రీనింగ్ చేసేందుకు వీలు కల్పించే ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నూతన నిబంధనల ప్రకారం, సాంకేతిక సంస్థలు తాము రూపొందించిన ఏఐ మోడళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
30 రోజుల గడువు..
కంపెనీలు సమర్పించిన ఈ అధునాతన ఏఐ మోడళ్లను క్షుణ్ణంగా పరిశీలించడానికి , పరీక్షించడానికి ప్రభుత్వానికి 30 రోజుల కాలపరిమితి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ ఖచ్చితంగా పాటించాల్సిన కఠినమైన నిబంధన ఏమీ కాదని, టెక్ కంపెనీలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనాల్సి ఉంటుందని సదరు అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు.
రెండు వారాల క్రితమే..
సాంకేతిక రంగంలోని సంస్థలపై కఠినమైన ఆంక్షలు లేదా నిబంధనలు విధిస్తే.. గ్లోబల్ టెక్ రేసులో అమెరికా వెనుకబడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో, దీనికి సంబంధించిన అధికారిక కార్యక్రమాన్ని దాదాపు రెండు వారాల క్రితమే అధ్యక్షుడు ట్రంప్ వాయిదా వేయడం గమనార్హం. తాజా ఉత్తర్వుల ద్వారా అటు సాంకేతిక పురోగతికి అడ్డుపడకుండా, ఇటు దేశ భద్రతను పర్యవేక్షించేలా అమెరికా ప్రభుత్వం సమతుల్యతను పాటించే ప్రయత్నం చేస్తోంది.








